ఆత్మకూరు... టీడీపీ మొదటి విజయమా?

May 25, 2020

ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోపు ప్రతిపక్ష పార్టీ చేసిన ఒక రాజకీయ పోరాటం సక్సెస్ కావడం అరుదైన విషయం. కానీ... సెల్ఫ్ గోల్ కింగ్ జగన్ వల్ల ఇది సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టినంత సులువు కాదు... అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం అంటే. ప్రత్యర్థి పార్టీపై పై చేయి సాధించడానికి సామాన్యులను నిస్సహాయులను చేసి హిట్లర్ కాలంలో జనాల్ని వేటాడినట్లు వేటాడుతుంటే... ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదు. శాంతి భద్రతలకు అడ్రెస్ లేదు. దీంతో చరిత్రలో కేవలం మనం చదువుకున్న అరాచక సంఘటనలు 2019లో మన కళ్ల ముందు చూడాల్సిన దుస్థితి వచ్చింది.

తెలుగుదేశం కార్యకర్తలపై అకారణంగా దాడులు చేయొద్దని, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని చంద్రబాబు ఎంత హెచ్చరించినా, ఎన్ని సార్లు వారించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరు అంటూ ఇచ్చిన పిలుపుతో గవర్నమెంటుకు చలిజ్వరం వచ్చింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని హౌస్ అరెస్టు చేసిన ఏకైక పాలకుడిగా జగన్ రికార్డు సృష్టించగా...  వైసీపీ ప్రభుత్వం తీరును ప్రతిఒక్కరు నిరసించారు. రైళ్లను తగలబెట్టినపుడు ప్రాణాలతో చెలగాడం ఆడినందుకు కేసు పెడితేనే హాహాకారలు జగన్... ఇపుడు ఒక మాజీ సీఎం చేయతలపెట్టిన పరామర్శ యాత్రకు ఇంతగా భయపడి... ఇన్ని అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడటం దేశమంతటా చర్చనీయాంశం అవుతోంది. నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా ఈ పోరాటానికి మద్దతు పలకడంపై వైసీపీ ప్రభుత్వం విస్మయానికి గురయ్యింది.

ఈ పోరాటంలో అన్ని జిల్లాలకు చెందిన తెలుగుదేశం నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే. చంద్రబాబును నిర్బంధించగా నారా లోకేష్ ను మధ్యలో అడ్డుకున్నారు. దేవినేని ఉమతో పాటు చాలామందిని గృహనిర్బంధంలో ఉంచి వైసీపీ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవినేని అవినాష్, భూమా అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధారాఘవరావు, నక్కా ఆనంద్ బాబు, ఎన్నారై టీడీపీ నేత బుచ్చి రామ్ ప్రసాద్ ఉద్యమించగా... ప్రభుత్వం ఎక్కడికక్కడ వారిని నిలువరించింది. ఉద్యమాన్ని అణిచివేశామని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది జరిగిన మూడు రోజులు అనంతరం కూడా దాని గురించి చర్చ జరుగుతోంది.

చలో ఆత్మకూరు ఎందుకు, అక్కడ ఏం జరుగుతోంది? అసలు వైసీపీ ప్రభుత్వ బాధితులు ఉండటం ఏంటి? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి వంటి అనేక విషయాలు ప్రజల్లో చర్చకు వచ్చాయి. జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యమంత్రి అసహనాన్ని అసమర్థతను, ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ‘చలో ఆత్మకూరు’ ఘటన బహిరంగ పరిచింది. గ్రామీణం నుంచి ఎన్నారైల వరకు అందరికీ ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకుకట్టినట్టు చూపింది. దీంతో ఈ పోరాటం జగన్ పై టీడీపీ మొదటి విజయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.