దీపం వెలిగాక కరెంటు పరిస్థితి ఏంటో తెలుసా?

August 10, 2020

భారత్ లాంటి దేశంలో ప్రధాని టీవీ తెర మీదకు వచ్చి.. మరో రెండు రోజుల్లో వచ్చే ఆదివారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు మీ ఇంట్లో లైట్లు ఆపేసి.. నూనె దీపం వెలిగించండి. కుదరకుంటే క్యాండిల్ వెలిగించండి. అది సాధ్యం కాకపోతే.. టార్చ్ లైట్.. సెల్ ఫోన్ లైట్.. ఏదైనా సరే.. ఇళ్లల్లో లైట్లు అపాలి. అలా తొమ్మిది నిమిషాల పాటు చేయాలి. ఆ చీకట్లలో మీరు వెలిగించే దీపం వెలుగులతో కరోనా మీద సమరశంఖం పూరించాలని కోరితే? దేశం ఎలా స్పందిస్తుంది?
దేశానికి ఇప్పటివరకూ చాలామంది ప్రధానులు పని చేశారు. కానీ.. ఇప్పటివరకూ ఎవరికి సాధ్యం కాని పనిని మోడీ చేశారు. తన మాటే మంత్రంగా దేశ ప్రజలు భావిస్తారన్న విషయాన్ని తన మాటతో చెప్పేశారు. చిన్నా పెద్ద.. ధనిక పేద.. సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా యావద్దేశం మోడీ చెప్పినట్లే.. సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల వేళకు లైట్లు ఆపేసి.. దీప కాంతులతో తమ సమర సందేశాన్ని కరోనాకు చెప్పేశారు.
ఇంత పెద్ద దేశంలో.. 130 కోట్లకు పైగా ప్రజలున్న దేశంలో.. ప్రధాని ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా.. క్రమశిక్షణతో దీపాన్ని వెలిగించిన వైనం నభూతో నభవిష్యతి అని మాత్రం చెప్పక తప్పదు. మోడీ మాటను యావద్దేశం పాటించిందని ఎలా చెబుతారు? టీవీల్లోనూ.. ఫేస్ బుక్కుల్లోనూ నాలుగు ప్రాంతాలు చూపిస్తే సరిపోతుందా? అంటూ వాదించేటోళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి వారంతా అంకెల్ని మాత్రమే నమ్ముతారు. అలాంటి వారికి సైతం నోటి వెంట మాట రాని విధంగా గణాంకాలు బయటకు వచ్చాయి.
మోడీ నోటి నుంచి వచ్చిన మాటను యావద్దేశం ఎంతలా పాటించిందనటానికి నిదర్శనంగా దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయిన వైనాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటల వేళకు అప్పటివరకూ అవుతున్న వినియోగం ఒక్కసారిగా పడిపోయింది.అదెంత అంటే? ఏకంగా 31.7గిగావాట్లు. అప్పటికి.. ఇంట్లో లైటు ఆపాలే కానీ.. ఫ్యాన్లు.. ఫ్రిజ్ లు.. టీవీలు ఆన్ చేసి ఉంచాలన్న విన్నపాన్ని అదే పనిగా చేస్తే.. ఆ మాత్రమైనా? అన్నది మర్చిపోకూడదు.
సరిగ్గా 9 గంటల వేళకు దేశ వ్యాప్తంగా పడిపోయిన విద్యుతు వినియోగం లెక్కలు చూస్తే.. దేశ ప్రజలు ప్రధాని మోడీ మాటలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారన్నది ఇట్టే అర్థమవుతుంది. తొమ్మిది గంటల వేళలో ఉన్న 117 గిగావాట్ల విద్యుత్ వినియోగం ఒక దశలో 85.3 గిగావాట్ల కంటే తక్కువగా పడిపోయింది. విద్యుత్ ఓల్టేజ్ లో హెచ్చుతగ్గులు లేకుండా ఇంజనీర్లు సమన్వయంతో పని చేసి పరిస్థితుల్ని చక్కదిద్దారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సరిగ్గా రాత్రి 9 గంటల 9 నిమిషాలకు మళ్లీ ప్రజలంతా మోడీ చెప్పినట్లే లైట్లు వెలిగించటంతో విద్యుత్ వినియోగం మళ్లీ 110 గిగావాట్లకు చేరుకోవటం గమనార్హం.