రాజ్యమేలుతున్నది జగన్ కాదు అరాచకం

July 15, 2020

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా గడవకముందే అరాచక పరిస్థితులు అధికమయ్యాయన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు మాటలు అదుపు తప్పతున్నాయని... భౌతిక దాడులకూ తెగబడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ సీఎం అయిన కొద్దిరోజులకే గుంటూరు జిల్లాలో, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలను ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే రాయలేని భాషలో దూషణలకు దిగుతున్నారని.. ఇదేమిటని నిలదీస్తే రాళ్లదాడులకు దిగుతున్నారని టీడీపీ, జనసేన నేతలంటున్నారు. కాకినాడలో ఈ రోజు జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన రాళ్లదాడిని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతుంటే జనసేన మహిళా కార్యకర్తలు చివరకు గుడిలో దాక్కుని ప్రాణాలు కాపాడుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రెండు పార్టీల నుంచి నిరసన వ్యక్తమైంది. పవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ద్వారంపూటి ఇంటిని ముట్టడించడానికి వెళ్లగా ఆయన అనుచరులు రాళ్లదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇక అమరావతిలోనూ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై పోలీసులు, వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు అనంతపురంలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి.జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతోందని.. ఇదెక్కడకైనా దారి తీయొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఇలా విపక్షాలపై దాడులు జరగలేదని, అరాచక పరిస్థితులు తలెత్తలేదని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకు 13 జిల్లాల్లోనూ ఒకేలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తల అరాచకం శ్రుతిమించుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తూ అణచివేతకు దిగుతున్నారని.. ఇష్టారాజ్యం సాగించడానికి ఎవరి అడ్డూ లేకుండా చేసుకునే ప్రయత్నం కనిపిస్తోందన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.

Read Also

బ్రేకింగ్‌: ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి పృథ్వీ అవుట్ !
‘అల వైకుంఠపురములో’ రివ్యూ
అమరావతి విషయంలో బీజేపీ షాకింగ్ డెసిషన్ ??