హౌడీ మోడీ అని ఎందుకు పెట్టారో తెలుసా?

August 13, 2020

భారత ప్రధానుల్లో విదేశీ వ్యవహారాలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న వ్యక్తిగా నరేంద్ర మోదీని పేర్కొనవచ్చు. తాజాగా ’’హౌడీ మోడీ‘‘ అంటూ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరుగుతున్న భారతీయుల సమావేశంలో మోడీ విదేశీ గడ్డ మీద ఏకంగా 50 వేల మంది స్వయంగా తరలివచ్చిన జనంతో బహిరంగ సభే నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నారైలలో మోడీకి ఉన్న ఆదరణకు చిహ్నం.

నిజానికి అమెరికాలో 10 వేల మందితో సభ అంటేనే అది అతిపెద్ద దాని కింద లెక్క. అమెరికాలోని ఎన్ఆర్ఐలను కుశలమడిగే కార్యక్రమంగా తీర్చిదిద్దిన ఈ ’’హౌడీ మోడీ‘‘ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. హ్యూస్టన్ ఇండియన్లతో హోరెత్తిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మోదీ స్క్రీన్లతో హ్యూస్టన్ కళకళలాడుతోంది. భారతీయ జెండాలు మన స్వాతంత్ర దినోత్సవం రోజు కనిపించినట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఒక పోప్‌ మినహా ఎవరూ ఇంత పెద్ద హాజరుతో సభను నిర్వహించలేదు. 
ఇక జనాల్ని ఆకట్టుకోవడంలో మోడీ వ్యూహాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మరి ఈ *హౌడీ మోడీ* అనేది వినడానికి భలే ఉంది. ఏంటి దీనర్థం అని పలువురు అడుగుతున్నారు. ఇదేంటో తెలుసా... మోడీ హౌ డు యూ డు అనే పదాన్ని రిథిమిక్‌గా హౌడీ మోడీగా మార్చారని ప్రచారం జరుగుతోంది. కానీ అది తప్పు. టెక్సాస్ రాష్ట్రంలో హౌడీ అనేది పాపులర్ వర్డ్. దీనర్థం ‘హౌ ఆర్ యు’ అని.  మెక్సికో నుంచి దిగుమతి అయిన పదం అనుకోవచ్చు. టెక్సాస్ మెక్సికో సరిహద్దుల్లో ఉండే అమెరికా రాష్ట్రం కావడంతో ఇక్క డ మెక్సికన్ పదాలే కాదు... మెక్సికన్ తిండి కూడా బాగా పాపులర్. మోడీ అనే పదానికి హౌడీ అనే పదం రిథమిక్ గా సూటవుతుందని అదే పదంతో ఈ భారీ ఈవెంట్ కు ‘ హౌడీ మోడీ’ అని నామకరణం చేశారు. మోడీ ప్రసంగం ఇంగ్లీషు, హిందీ, స్పానిష్‌లలో ఏకకాలంలో వినే అవకాశం ఉంటుంది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30కు ఈవెంట్ ముగుస్తుంది.