మాకు పాత చంద్రబాబే కావాలి !!!

July 07, 2020

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజుననే ఏపీ విపక్ష నేత హోదాలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్నా... 15 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగడమే కాకుండా పదేళ్ల పాటు విపక్ష హోదాలో తనదైన శైలిలో రాణించిన చంద్రబాబేనా ఇలా వ్యవహరించింది అన్న వాదనలు కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా తనను తాను చెప్పుకోవడమే కాకుండా... ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఓ వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని ఏకతాటిపై నడిపిన సత్తా కలిగిన నేతగా తనను తాను నిరూపించుకున్న చంద్రబాబు... అసెంబ్లీలో తనను అవమానించేలా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేసి నిజంగానే పార్టీ శ్రేణులను, ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారని చెప్పక తప్పదు.

ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తనదైన శైలిలో ఢీకొట్టి, విపక్షంలో ఉండి కూడా రాజశేఖరరెడ్డి నోట మాట రాకుండా చేసిన నేతేనా ఇలా మాట్లాడుతున్నదన్న ఆందోళనను కూడా చంద్రబాబు తన పార్టీ శ్రేణుల్లో కలిగించారని చెప్పక తప్పదు. నాడు నవ్వడమే రాదని ఎగతాళి చేసిన రాజశేఖరరెడ్డిపై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు... ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపై మరింతగా విరుచుకుపడాల్సింది పోయి... వయసులో పెద్దవాడిని తనను అవమానిస్తారా? అంటూ బేల మాటలు మాట్లాడటం నిజంగానే టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసిందని చెప్పక తప్పదు. రాజకీయం అన్నాక అధికార పక్షంలోని వారు, అది రాజకీయాలపై అంతగా పరిపక్వత లేని జగన్ అండ్ కో లాంటి వారి నుంచి ఈ తరహా మాటలు రాకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, తమ తీరును తమ మాటతోనే బయటపెట్టేసుకుంటున్న జగన్ తీరుతో ఆవేదన చెందాల్సిన అవసరమేమిటన్నది టీడీపీ శ్రేణుల వాదన.

అయినా ఏ విషయంపై అయినా నాన్ స్టాప్ గా ఆధారాలతో సహా బదులివ్వగలిగేంత అనుభవాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నోట ఆవేదన లాంటి మాట ఎలా వింటామని కూడా టీడీపీ శ్రేణులు కాస్తంత గుర్రుగానే ఉన్నాయి. అయినా రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమేనని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్న చంద్రబాబు... ప్రత్యర్థి చెలరేగిపోతే... ఆ ప్రత్యర్థిని చేష్టలుడిగేలా కడిగిపారేసే బదులుగా తనను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేయడమేంటనేది వారి ప్రశ్న. అయినా నాడు విపక్ష నేత హోదాలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద సాగించిన అలుపెరగని పోరాటాన్ని అప్పుడే మరిచారా? అంటూ కూడా చంద్రబాబును టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించి కూడా విపక్ష నేత హోదాలో బాబ్లీ వద్దకెళితే... పోలీసులు చేతులు పట్టి లాగేస్తే కూడా చలించని చంద్రబాబును గుర్తు చేసుకుంటున్న శ్రేణులు... ఇప్పుడు జగన్ ఏదో రెండు మాటలంటే... వాటిని తుత్తునీయలు చేయాల్సింది పోయి ఆవేదన వ్యక్తం చేస్తారా? అని కూడా ఓ రేంజిలో ఫైరైపోతున్నారు.

అయినా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పార్టీ ఓటమి పాలైన నేఫథ్యంలో పార్టీ శ్రేణులను కొత్త ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి... మీరే ఆవేదన వ్యక్తం చేస్తే ఎలాగని కూడా కొందరు యువ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా పార్టీ ఓడిన నేపథ్యంలో సానుభూతి యాంగిల్ పనికి రాదన్న విషయాన్ని కూడా చంద్రబాబు ఎలా మరిచిపోయారని కూడా వాదిస్తున్నారు. మొత్తంగా తనలోని ధైర్యాన్ని బయటపెట్టాల్సిన సమయంలో ధీనత్వంతో ముందకెళితే పార్టీ బ్రతికేదెలా అన్న వాదన కూడా ఇప్పుడు కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. సో... చంద్రబాబు ఇప్పటికిప్పుడు గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ఆవేదన తరహా వ్యాఖ్యలకు, చూపిన ధీనత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేసి... తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రోది చేసుకున్న ధైర్యాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.