టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది...?

May 26, 2020

ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతున్నదా...? నాయకత్వంపై ఆగ్రహావేశం పేరుకుపోతున్నదా...?

అగ్ని పర్వతం బద్దలవడానికి, లావా ఎగజిమ్మడానికి కాలం దగ్గరపడుతున్నదా...?

ఆ పార్టీలోని పరిణామాలను ఒకటొక్కటిగా చూస్తుంటే... ఇలాగే అనిపిస్తోంది. ఇప్పటికే, హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారు. ఈటల రాజేందర్ కు పొమ్మనలేక పొగ పెడుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి కొందరికి మాత్రమే అధినేత పెద్ద పీట వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన పార్టీ నుంచి వలసొచ్చిన ఈ నేతలంతా... ఇప్పుడు కేసీఆర్ కు బాగా కావాల్సినోళ్లయ్యారు. ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన నేతలు హరీష్, ఈటల వంటి వాళ్లేమో కానోళ్లయ్యారు. ఇదంతా గమనిస్తున్న టీఆర్ఎస్ పార్టీలోని ఉద్యమ నేతలంతా లోలోపల తీవ్రంగా మదనపడుతున్నారు, మండిపడుతున్నారు, భగ్గుమంటున్నారు. అందుకే, ఇటీవలి కాలంలో పార్టీ కీలక సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. దీనిని సావకాశంగా మరల్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజల సొమ్మంతా వారి వద్ద గుట్టలుగా పడుందని విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. రాజకీయంగానూ దూకుడుగా దూసుకెళుతున్నారు. చాప కింద నీరులా క్షేత్రస్థాయిలో జనంలోకి చొచ్చుకెళుతున్నారు. మరోవైపు, కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెడుతోంది. ప్రతి విషయంలోనూ మోకాలడ్డుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని స్థానిక నాయకులకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రతిష్టకు సవాల్ లాంటి మున్సిపల్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీ బలమంతా పల్లె ప్రాంతాల్లోనే ఉంది. పట్టణ ప్రాంతాల్లోబలహీనంగా ఉంది. అందుకే, మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉంటే... నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేశారు. అందుకే, జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించారు. దీనికి, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారట. కీలక సమావేశమని తెలిసి కూడా రాకపోవడాన్ని కేటీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్న సమావేశానికి ఎగ్గొట్టారంటే... ఎన్నికల్లో అంటీముట్టనట్టుగా ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అందుకే, గైర్హాజరు ఎమ్మెల్యేలపై మండిపడ్డారట. అంతేకాదు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఈ రెండు జిల్లాల్లోని కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ ఉగ్రులయ్యారట.

ఈ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారంతా... టీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ నిర్వాకమే కారణంగా నిలుస్తుందని, కుటుంబ వారసత్వ రాజకీయాలే కొంప ముంచుతాయని, వలస నేతలతో ఆ పార్టీ నిండా మునగడం ఖాయమని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ... అంతిమంగా బీజేపీకిగానీ, కాంగ్రెసుకుగానీ లాభిస్తాయని జోస్యం చెబుతున్నారు.