థియేటర్లు ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?

August 06, 2020

మూడు రోజుల్లో మొత్తం సీన్ మారిపోయిందన్నట్లుగా కనిపించే టాలీవుడ్ వ్యవహారం వెనుక వర్క్ చాలానే ఉంది. సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని భావించారు. ఇందుకోసం ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపైన చర్చలు జరిగాక.. చివరకు చిరును ఫైనల్ చేశారు. షూటింగ్ లకు సర్కారు సరే అనేందుకు వీలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. షూటింగ్ లు తిరిగి స్టార్ట్ చేసేందుకు కేసీఆర్ సానుకూలంగా ఉండటంతో చర్చల ప్రక్రియ జోరందుకుంది.

ఎట్టకేలకు తెలంగాణ సర్కారు షూటింగ్ లకు ఓకే చెప్పేసింది. మరి.. వెండితెర మీద బొమ్మ పడేదెప్పుడు? అన్నది ప్రశ్నగా మారింది. సినిమా షూటింగ్ లకు అనుమతి అంటే.. వాటిని ప్రదర్శించటానికి థియేటర్లకు సైతం ఓకే అనాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరో నెల నుంచి రెండు నెలల వ్యవధిలోపు థియేటర్లు స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది.
తొలుత థియేటర్లలో పాటించాల్సిన మార్గదర్శకాల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని.. అనంతరం అందుకు అనుగుణంగా మార్పులు జరగటానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు సాగితే జూన్ నెలాఖరు నుంచి జులై చివరి లోపు థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలుత అనుకున్నట్లుగా ఈ ఏడాది చివరి వరకూ థియేటర్లు తెరిచే అవకాశం లేదన్న వాదన సరికాదంటున్నారు.
ఎందుకంటే వేలాది కోట్ల టర్నోవర్ ఉండే సినిమా మాధ్యమం ఆగిపోతే.. లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుందని.. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని థియేటర్లు ఓపెన్ చేసే దిశగా సమాలోచనలు సాగుతున్నాయి.