తెల్లకార్డు ఉంటే స్థలాలు కొనకూడదు!!

May 29, 2020

సీఎం జగన్‌ సొంత శాసనం
రాజధాని భూ కొనుగోళ్లపై వితండ వాదన
797 మంది తెల్లకార్డు దారులు
761.34 ఎకరాలు కొన్నారట!
కనీసం పాన్‌ కూడా వారికి లేదట!
వారిపై విచారణకు ఐటీ, ఈడీలకు లేఖలు
రాష్ట్రంలో 95ు మందికి తెల్లకార్డులే
ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇదే అర్హత
ఐదెకరాల్లోపున్న రైతులూ కార్డుకు అర్హులే
వ్యవసాయ ఆదాయంతో ఆర్థిక స్థితి మెరుగు
అందుకే భూములు కొన్నారు
పిల్లల సంపాదనతో కొన్నవారూ ఉన్నారు
తెల్ల కార్డుదారులు కొనకూడదన్న చట్టం ఉందా?
ద్రవ్య అక్రమ చలామణీ వరకే ఈడీ పరిధి
అయినా కేసుల నమోదుపై నిపుణుల విస్మయం
నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి జగన్‌ అనుకున్నదే శాసనం. రాజ్యాంగం, రూల్‌ ఆఫ్‌ లా ఆయన ముందు బలాదూర్‌. ఆయన చెప్పిందే చట్టం.. చేసిందే పరిపాలన. రాజధాని అమరావతిపై మొదటి నుంచీ కత్తిగట్టిన ఆయన.. అనేక అడ్డగోలు ఆరోపణలతో దాని పీకపిసికే ప్రయత్నాల్లో ఉన్నారు. అవి ఫలించకపోగా బెడిసికొడుతుండడంతో రాజధానికి భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతులపై పడ్డారు. తెల్లకార్డు దారులు రాజధాని పరిధిలో భూములు కొన్నారని.. ఇది అక్రమమని ఫత్వాచేశారు. దానికి అనుగుణంగా వారిపై సీఐడీని ప్రయోగించారు. సీఐడీ విచారణలో ఏమీ తేలకపోవడంతో భూములు కొన్న కొందరు తెల్ల కార్డుదారులను ఏరి.. వారి ద్వారా టీడీపీ హయాంలో మంత్రులుగా, ఇతర పదవులు నిర్వహించిన వారిపై కేసులు పెడుతోంది. ఇప్పటికే నాటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, వెంకటపాలేనికి చెందిన వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్‌ బెల్లంకొండ నరసింహారావుపై కేసులు నమోదుచేసింది. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్లు కూడా మోపింది. వీరేకాదు.. మొత్తం 797 మంది తెల్ల రేషన్‌కార్డులు ఉన్నవారు 761.34 ఎకరాల పొలం కొన్నట్లు సీఐడీ వెల్లడించింది. అంకెల సగటు చూస్తూ ఒక వ్యక్తి సగటున ఎకరం కూడా కొననట్లే కదా! రాజధాని ప్రాంతంలో ధనవంతులు మాత్రమే భూములు కొనాలని రూలేమైనా ఉందా? వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) అధికారులను ఉసిగొల్పుతున్నారు. తెల్లకార్డు ఉన్నవారికి పాన్‌కార్డు ఎలా ఉంటుంది? వ్యవసాయాదాయంపై ఆదాయ పన్ను లేదు కదా! మరి వారొచ్చి ఏం విచారిస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వచ్చి చిన్న, సన్నకారు రైతులపై పడడమేంటి? అంటే జగన్‌ అకృత్యాలకు మోదీ ప్రభుత్వం కూడా అండగా ఉన్నట్లే అనుకోవాలి. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికి అమాయక రైతులను బలికోరడమేంటి? రాజమహేంద్రవరం ప్రాంతంలో నాలుగెకరాల భూమి ఉంటే మంచి ఆదాయం వస్తున్నట్లే కదా! అమరావతి రాజధాని అయితే.. ధరలు బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో అక్కడ ఓ నాలుగెకరాల ఆసామి అరెకరం భూమి కొనుక్కున్నారు. దానిని భూ సమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చి.. అందుకు బదులుగా వచ్చిన ప్లాటు తీసుకున్నారు. ఇప్పుడు దీనిపై సీఐడీ విచారణ జరుపుతోంది. పైగా... ఈడీ కూడా దర్యాప్తు చేస్తుందట! ‘నా డబ్బుతో నేను స్థలం కొనుక్కుంటే తప్పేముంది?’ అన్నది ఆ రైతు ప్రశ్న. ‘నీకు తెల్లకార్డు ఉంది! భూమి ఎలా కొంటావ్‌! నువ్వు కచ్చితంగా బినామీవే’ అని ప్రభుత్వం అంటోంది.
అందరికీ ఎడాపెడా తెల్ల కార్డులు..
‘సంతృప్త స్థాయి’ పేరిట ముందూ వెనుకా చూడకుండా దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ గత ప్రభుత్వాలు ఎడాపెడా తెల్లకార్డులు ఇచ్చేశాయి. ఈ ప్రక్రియకు జగన్‌ తండ్రి వైఎస్సే శ్రీకారం చుట్టారు. దానినే అందరూ పాటిస్తున్నారు. ఇప్పుడు తెల్లకార్డు ఉన్నవారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనంటూ, అమరావతి భూముల కొనుగోళ్లపై ఆరా తీయాలని జగన్‌ ఆదేశించారు. ఇది బట్టతలకూ, మోకాలికీ ముడిపెట్టడమే. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి తెల్లకార్డులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయిస్తే, ప్రతి ఒక్కరూ తెల్లకార్డుదారులే! రేషన్‌ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీలాంటి అన్ని పథకాలకు అర్హత తెల్లకార్డే. దీంతో... వీలైన ప్రతిఒక్కరూ తెల్లకార్డులు తీసేసుకున్నారు. అపరిమిత ఆదాయం, భూమి ఉన్నవారికి కూడా వీటిని మంజూరు చేసేశారు. పరిశీలించి ఇవ్వాల్సిన ప్రభుత్వమే తెల్లకార్డులు ఉదారంగా ఇచ్చేసింది. ఒక దశలో రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యను మించి కార్డులు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంతంలో భూములు కొన్న వారిలోనూ అనేక మంది తెల్లకార్డుదారులున్నారు. ఇప్పుడు వీరందరినీ బినామీలుగా అనుమానిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు కేసులు పెట్టేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే... లక్షలు కొని భూమి కొనే సామర్థ్యం ఉన్నందున వారికి తెల్లకార్డును రద్దు చేసేయొచ్చు. కానీ వారిని బినామీలుగా, అక్రమార్కులుగా చిత్రీకరించడం విస్తుగొలుపుతోంది. తెల్లకార్డుదారుడు భూమి కొనుగోలు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఏ సెక్షన్‌, ఏ చట్టం ప్రకారం చూసినా ఇందులో తప్పు లేదని పేర్కొంటున్నారు. ‘మీరు స్థిరాస్తులు కొంటే ప్రభుత్వానికి చెప్పాలి’ అనే నిబంధన కూడా తెల్లకార్డుల వెనుక లేదని గుర్తుచేస్తున్నారు.
ఎప్పుడూ పేదవాడిగానే ఉండిపోవాలా?
ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తెల్లకార్డు తీసుకున్నప్పుడు అతను పేదవాడే. కానీ ఆ తర్వాత కష్టపడి, అప్పోసప్పో చేసి పొలం/స్థలం కొనుక్కున్న వారు ఎందరో ఉన్నారు. పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయడంతో ఆర్థిక స్థితి మారిన వారూ ఉన్నారు. ఇలా సంపాదించుకున్న సొమ్ముతో అమరావతిలో భూమి కొంటే తప్పేముంది? తెల్లకార్డుదారుల ఆర్థిక స్థితిగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ... ఆదాయ పరిమితి ఆధారంగా కార్డును తొలగించాల్సిన బాధ్యత సర్కారుదే! ఆ పనిచేయకుండా తమ కష్టార్జితంతో.. ఎంతో కొంత లాభం వస్తుందన్న ఆశతో అరెకరం, 10-15 సెంట్లు కొనుగోలు చేసిన వారిని కూడా భయభ్రాంతులను చేయడం దారుణం. చాలా మంది అప్పులు చేసి కూడా అమరావతిలో స్థలాలు కొన్నారు.
సీఐడీ, ఐటీ, ఈడీ ఏం చేస్తాయి?
అమరావతిలో భూములు కొన్న తెల్లరేషన్‌ కార్డుదారులపై సీఐడీ, ఈడీ  దర్యాప్తు జరిపి ఏం చేస్తాయి? అందరి వివరాలు ఐటీ శాఖకు పంపిస్తారనే సమాధానం వస్తోంది. వాస్తవానికి వ్యవసాయ ఆదాయంపై ఆదాయపు పన్నే లేదు. ఐదెకరాల వరకు భూమి ఉన్నా తెల్లకార్డు ఇస్తున్నారు. ఆ భూమిపై సంపాదించిన ఆదాయంపై రైతులు ఐటీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిటర్నులు కూడా దాఖలు చేయక్కర్లేదు. వ్యవసాయ ఆదాయం రూ.4 లక్షలున్నా, రూ.10 లక్షలున్నా.. అంతకంటే ఎక్కువున్నా పన్ను లేదు. ఇప్పుడు అమరావతిలో భూములు కొనుగోలు చేసినవారిలో చాలామంది వ్యవసాయదారులే. వారందరికీ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినా... తాము వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేశామంటే చేసేదేమీ ఉండదని రిటైర్డ్‌ ఐటీ అధికారి ఒకరు తెలిపారు.
సీఎం ఇంటికైనా... అంతే!
మరోవైపు.. రాజధానిలో భూమిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసినా.. కేవలం రిజిస్ర్టేషన్‌ విలువనే చూపించారంటూ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. దీనిపైనా సీఐడీ దృష్టి సారిస్తుందంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన వాదన. రాష్ట్రంలోనే కాదు... యావత దేశంలో ఎవరైనా డాక్యుమెంట్‌లో రిజిసే్ట్రషన్‌ విలువనే చూపిస్తారు. లోన్‌ తీసుకుని కొంటే.. నిబంధనల మేరకు గరిష్ఠంగా ఎంత చూపించాలో అంత చూపిస్తారు. ఇదంతా రిజిసే్ట్రషన్‌ ఫీజు తగ్గించుకునేందుకే! ఎక్కడిదాకానో ఎందుకు... తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసం కోసం దాదాపు మూడెకరాలు కొన్నారు. ఆ భూమి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్లు ఉంటుంది. అందులో సుమారు 73వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని నిర్మించారు. అందులో వాడిన టైల్స్‌, విద్యుత, ప్లంబింగ్‌ సామగ్రిని బట్టి ఇంటి నిర్మాణ వ్యయం రూ.5 నుంచి 10 కోట్లు ఖర్చయి ఉంటుంది. అంటే... స్థలం, ఇల్లూ కలిపి రూ.45 నుంచి 50 కోట్లు! కానీ... ఆ ఆస్తి రిజిస్ర్టేషన్‌ సమయంలో రూ.26 కోట్లుగా చూపించారు. అంటే... రిజిసే్ట్రషన్‌ విలువనే అనుసరించారన్న మాట. తెల్లకార్డు ఉన్నవాళ్లు అరెకరం భూమిని రూ.4 లక్షలకే రిజిస్ర్టేషన్‌ చేయించుకోవడం తప్పయితే... ముఖ్యమంత్రిదీ తప్పేనన్నది నిపుణుల మాట! బినామీల మాట వచ్చింది కాబట్టి జగన్‌ ఇంటి విషయానికే వద్దాం. అది ఆయన పేరిట గానీ, ఆయన కుటుంబ సభ్యుల పేరిటగానీ లేదు. ఎవరో సునీల్‌రెడ్డి, ఇంకో ఐదుగురి పేరిట ఉందని అంటున్నారు. తెల్లకార్డు దారులను బినామీలంటున్న జగన్‌.. బినామీల పేరిట కొన్న ఇంట్లోనే ఉండడం గమనార్హం. సీఐడీ అధికారులు తమ దర్యాప్తు వివరాలను ఈడీకి కూడా సమర్పించారు. అసలు సీఐడీ నమోదు చేసిన కేసు పరిధి ఏంటి? ఈడీకి ఎందుకిస్తారు..? ఎలా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో,  హవాలా రూపంలో డబ్బులు పంపి ఆస్తులు కొనుగోలు చేయడం, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక నేరాల్లో ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఉదాహరణకు.. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల ప్రవాహంపై ఈడీ కేసులు నమోదు చేసింది. చార్జిషీట్లు కూడా వేసింది.  రాజధాని భూముల వ్యవహారంలో ఇలాంటి ఘోరాలు జరిగాయని అనుమానించడమే చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన అనుమానంపైనా ఈడీ విచారణకు సిఫారసు చేశారన్నది మరో వాదన! అయితే... ఫెమా ఉల్లంఘనలో రెండు రకాలున్నాయి. ప్రవాసులు ఎవరైనా ఇక్కడ భూములు కొనుగోలు చేయాలంటే ముందుగా రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోకుండా భూములు కొంటే ఫెమాను ఉల్లంఘించినట్లే! కానీ ప్రవాసులు పంపిన డబ్బుతో ఇక్కడి వారు ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే అది తప్పుకాదు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలు పంపినా, లేకుంటే అక్కడి నుంచి ఎవరైనా అప్పు ఇచ్చినా.. ఆ సొమ్ముతో రాష్ట్రంలో ఉన్నవారు ఆస్తులు, భూములు కొనుగోలు చేయవచ్చు! ఇవి ఆయా చట్టాలు స్పష్టంగా చెబుతున్న సంగతులు!! ఇంకోవైపు.. అమరావతి ప్రాంతంలో 2015 నుంచి జరిగిన భూ లావాదేవీల్లో 108 లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని సీఐడీ ప్రకటించింది. దళితుల నుంచి కేవలం ఐదు లక్షలతో ఎకరం కొనుగోలు చేసి ఆ తర్వాత ప్లాట్ల ద్వారా కోట్లు సంపాదించిన వ్యక్తులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ లావాదేవీల్లో జరిగిన భాగోతాన్ని వివరిస్తూ రెండు లక్షలకు పైగా ఉన్న ఆర్ధిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు సీఐడీ లేఖ రాసింది. డాక్యుమెంట్‌ డేట్‌, నంబరు, రిజిసే్త్రషన్‌, విక్రయదారు, కొనుగోలుదారు, భూమి విస్తీర్ణం, గ్రామం, సర్వే నంబర్‌, మండలం తదితర వివరాలు కూడా దానికి జతచేసింది. ఇప్పుడు ఐటీ ఏం చేస్తుందో చూడాలి. 

RELATED ARTICLES

  • No related artciles found