కరోనాతో తల గోక్కొన్నది వీళ్లే

August 07, 2020

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 వ్యాప్తి తక్కువగానే ఉంది. అయితే, అనుమానిత కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చినవారే బాధితులుగా ఆస్పత్రుల్లో చేరుతున్నాయి. ఇందులో... ఇటలీ, దుబాయ్, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చినవారిలోనే వైరస్‌ లక్షణాలు కనిపించినట్లు తేలింది. మిగిలిన దేశాల నుంచి వచ్చినవారితో పెద్దగా ప్రాబ్లం లేదు. దీంతో ఆ మూడు దేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగుతున్నవారిపై అధికారులు స్పెషల్‌గా దృష్టి పెట్టారు. విమానాశ్రయంలోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా అటు నుంచి అటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్‌ లక్షణాలు లేకపోయినా అధికారులు వదలడం లేదు. ఎయిర్‌పోర్టు నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా నేరుగా ఇంటికే వెళ్లమని చెబుతున్నారు. రెండు వారాలపాటు ఎట్టి పరిస్థితుల్లో గడప దాటొద్దని, ఇంట్లోనూ ఒకే గదికి పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఐసోలేషన్‌లో ఉన్న ఆ 14 రోజుల్లో తాము వాడే వస్తువులను ఇతరులు ముట్టుకోకుండా చూడాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి వైరస్‌ పరీక్షలు చేసుకుని, కొవిడ్‌ లేదని తేలిన తర్వాతే బయటకు వెళ్లాలని అధికారులు గట్టిగానే సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది యువకులు చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో ఉంటున్నారు. ఇంట్లో వాళ్లను చూడటానికో, ఇతర పనుల మీదో ఆయా దేశాల నుంచి తిరిగి వస్తున్నారు. వీరంతా తమ టూర్‌ని రెండు, మూడు నెలల ముందే ప్లాన్‌ చేసుకుని, అప్పుడే జర్నీ టిక్కెట్లు కొంటారు. టిక్కెట్లు బుక్‌ చేసినప్పుడు లేని కరోనా, ఇప్పుడు కలవర పెడుతోంది. వేలకు వేలు పోసి కొన్న టిక్కెట్లను క్యాన్సిల్‌ చేయలేక, పనులు వాయిదా వేసుకోలేక చాలామంది విదేశాల్లో విమానం ఎక్కేసి శంషాబాద్‌లో దిగుతున్నారు. వారితోపాటే వైరస్‌ కూడా ఇక్కడ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక పాజిటివ్‌తోపాటు 19 అనుమానిత కేసులు నమోదయ్యాయి.