WHO : నవనాడులు కుంగిపోయే మాట చెబుతావేం సామీ!!

August 12, 2020

యావత్ ప్రపంచానికి గుండెలు అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది.

కరోనా దెబ్బకు కకావికలమైన ప్రపంచానికి ఇంతకు మించిన దుర్వార్త మరొకటి ఉండదేమో?

చైనాలోని వూహాన్ లో మొదలైన వైరస్ వ్యాప్తి ఇప్పుడు ప్రపంచాన్ని అట్టుడికిపోయేలా చేస్తుంది.

గడిచిన ఆరు నెలలుగా కిందా మీదా పడుతున్న ప్రపంచం.. మరో ఆర్నెల్లు గడిచేసరికి అంతా సర్దుకుంటుందని.. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు పరిస్థితి బాగోకున్నా.. మరికొద్ది నెలలు వెయిట్ చేస్తే.. పరిస్థితుల్లో మార్పులు వస్తాయన్న ఆశతో ఉన్న వారంతా నీరు కారిపోయేలా.. నిలువెత్తు నిరుత్సాహం కమ్మేసే వార్త ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దాయన నోటి నుంచి తాజాగా వచ్చింది.

కంటికి కనిపించని వైరస్ తో పోరాడుతున్న ప్రపంచానికి.. దాని నుంచి పూర్తిగా బయటపడేందుకు తక్కువలో తక్కువ పదేళ్లు పడుతుందని చెబుతున్నారు.

కరోనా ప్రభావం మొదలై ఆర్నెల్లు పూర్తి అయిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ ఓ అత్యవసర విభాగం సమావేశమైంది.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్అధ్నామ్ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం పదేళ్ల పాటు ఉంటుందని బాంబు పేల్చారు.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు.

కరోనాకు సంబంధించి శాస్త్రసాంకేతిక సంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించినా.. ఇంకా దొరకాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికే కరోనా సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో మరోసారి చెలరేగిపోయే ప్రమాదం ఉందన్నారు.

తొలినాళ్లలో వైరస్ ప్రభావానికి గురి కాని దేశాలు సైతం ఇప్పుడు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న చెప్పారు.

కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని హెచ్చరించటం.. అందరిని అప్రమత్తం చేయటంలో డబ్ల్యూహెచ్ ఓ దారుణంగా విఫలమైందన్న వాదనలు జోరుగా వినిపిస్తున్న వేళ.. దీని ప్రభావం పదేళ్లు ఉంటుందన్న మాట షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.

ఇదంతా చూసినప్పుడ గడిచిన కాలమే మధురమన్న పాతమాట చటుక్కున గుర్తుకు రాక మానదు.

Read Also

కలియు దాన వీర శూర కర్ణ... జయహో
కేంద్రం సంచలనం - విద్యా విద్యానంలో సమూల మార్పులు
వెంకయ్యనాయుడు చెబితే జగన్ వింటారా..