బాబు ప్రశ్న... హు కిల్డ్ బాబాయి  ?

May 25, 2020

అధికారంలో ఉండటం ఎంత కష్టమో జగన్ కు ఇటీవల బాగా అర్థమవుతూ ఉండి ఉంటుంది. ప్రతిపక్షానికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో కూడా జగన్  కు ఈరోజు అర్థమై ఉంటుంది. ఎందుకంటే.. స్వేచ్ఛ కోల్పోయిన వ్యక్తి జగన్. నోటికి ఏది తలిస్తే అది అధికార పక్షంపై ఆరోపణలు చేసి... చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుని కింద ఉన్న ముల్లులను లెక్కపెట్టుకునే పరిస్థితి.తనకు ఎవరో కాదు.. తన హామీలే భారం. తన వ్యాఖ్యలే ఇబ్బంది. తన విమర్శలే ఇపుడు తనపై ఎక్కుపెట్టిన బల్లాలు.

ప్రతిపక్ష హోదాను చంద్రబాబు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘‘మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్య వెనక బోల్డన్ని అనుమానాలు ఉన్నాయి. ఆత్మహత్యకు ముందు నిందితుడు రాసిన సూసైడ్ లేఖలో రెండు చేతి రాతలు ఉన్నాయి. పైగా అధికారంలోకి వచ్చి 100 రోజులైనా బాబాయిని చంపిన వారిని పట్టుకోలేకపోయారని, కేసులో పురోగతి కూడా లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతారు’’  అంటూ చంద్రబాబు జగన్ ను నిలదీశారు. తన బాబాయిని చంపిన వాడిని ఇన్ని రోజులుల అయినా ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.
రాజన్య రాజ్యం అంటే... హత్యల రాజ్యమా? ఆటవిక రాజ్యమా? వంద రోజుల్లో రాష్ట్రంలో 8 హత్యలు జరిగాయి. వందల కుటుంబాలు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాయి అంటే ముఖ్యమంత్రి పాలన ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతోందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. శాంతిభద్రతలు జీరో అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ బాధితులను రక్షించే బాధ్యత తనదేనని చెప్పారు. వైసీపీ బాధితుల పరిరక్షణ కోసం చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి, మరో ఇద్దరు ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. బాధితుల శిబిరాన్ని ఈ కమిటీయే పర్యవేక్షిస్తుంది.