‘సైరా’ గురించి ఒక రహస్యం....

February 19, 2020

‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాకు సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకోవడం పట్ల ముందు నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అతను ఇలాంటి సినిమాను డీల్ చేయగలడా అన్న సందేహాలు చాలామందిలో కలిగాయి. ఐతే ఈ సినిమా చూశాక అతను తన బాధ్యతను బాగానే నిర్వర్తించాడనిపించింది. ఐతే పుష్కరం కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తొలిసారి విన్నపుడు మాత్రం దర్శకుడు ఎవరు అనే విషయంలో అయోమయ స్థితి నెలకొందట. ఈ కథను సినిమాగా తీయాలని ముందుగా తలపోసిన పరుచూరి సోదరులు మాత్రం దర్శకుడిగా మెగస్టార్ చిరంజీవినే అనుకున్నారట. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌తో దసరా స్పెషల్ ‘సైరా’ ఇంటర్వ్యూ సందర్భంగా చిరు స్వయంగా వెల్లడించాడు. చిరు కూడా ఈ విషయాన్ని ముందు కొట్టిపారేయలేదట.

90ల్లో ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ లాంటి సినిమాలకు తాను అన్నీ తానై వ్యవహరించడం, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కావడం, మేకింగ్ కూడా చూసుకోవడంతో తాను సినిమాను డైరెక్ట్ చేయగలనని పరుచూరి సోదరులు నమ్మారని.. ఉయ్యాలవాడ కథకు తానే న్యాయం చేయగలనని అన్నట్లు చిరు తెలిపాడు. ఐతే సినిమాను డైరెక్ట్ చేయగల కాన్ఫిడెన్స్ తనకు ఉందని.. కానీ ఆ పని తాను చేస్తే హీరోగా పూర్తి స్థాయిలో దృష్టిసారించలేనని.. అన్ని వ్యవహాారాలూ చూసుకుంటూ హీరోగా నటించడం కష్టమని.. తానే డైరెక్ట్ చేయాలంటే మాత్రం హీరోగా వేరొకరు ఉండాలని తాను అభిప్రాయపడ్డానని.. కానీ పరుచూరి సోదరులు మాత్రం హీరోగా కచ్చితంగా తానే ఉండాలని పట్టుబట్టారని.. దీంతో దర్శకుడు ఎవరు అనే విషయంలో సందిగ్ధత నెలకొందని చెప్పాడు చిరు. అప్పటికి బడ్జెట్ విషయంలో ఉన్న ఇబ్బందులకు తోడు దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు అనే ప్రశ్నతోనే సినిమా ఆగిపోయిందన్నాడు. చివరికి మూడేళ్ల కిందట చరణ్‌తో ‘ధృవ’ చేసిన సురేందర్‌ను దర్శకుడిగా ఖరారు చేసి సొంతంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తీయడానికి సంకల్పించినట్లు చిరు వెల్లడించాడు.