భీమిలి బరి... గెలుపెవరిదో మరి...

September 17, 2019

విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. నువ్వా? నేనా?... అన్నట్టుగా పోటాపోటీగా ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి, వైసీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో నిలిచారు. ఒకరు అనకాపల్లి ప్రస్తుత ఎంపీ...మరొకరు మాజీ ఎంపీ. ఇద్దరూ ఇద్దరే. హేమాహేమాలీ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ఘనత ఒకరిదైతే... అపజయం ఎరుగని చరిత మరొకరిది.
భీమునిపట్నం చారిత్రక ప్రాంతం. దేశంలో ద్వితీయ మున్సిపాలిటీగా 158 ఏళ్ల క్రితమే గుర్తింపు పొందిన పట్టణం. అక్కడి నుంచి ఇప్పుడు అసెంబ్లీకి ఇద్దరు ఉద్దండులు పోటీ పడుతున్నారు. ఒకరు గల్లీ నుంచి రాజకీయాలు మొదలుపెట్టి ఢిల్లీ వరకు ఎదిగితే, మరొకరు రాజకీయ రంగంలోను లక్ష్యాలు నిర్దేశించుకొని ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇద్దరిలో ఒకరు విశాఖ నగర మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కాగా మరొకరు అనకాపల్లి ప్రస్తుత ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఈసారి వీరిద్దరూ నువ్వా? నేనా? అంటూ సమరానికి సిద్ధమవుతున్నారు.
టీడీపీకి కంచుకోట
భీమిలి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు ఎనిమిదిసార్లు సార్వత్రిక ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కర్రి సీతారామ్‌ గెలవగా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో (2014) గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కర్రి సీతారామ్‌పై 37,226 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అవంతి శ్రీనివాసరావు 2009-2014 వరకు భీమిలి ఎమ్మెల్యేగా చేసి ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌పై 47,932 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆయన భీమిలి సీటు తనకు కేటాయించాలని తెదేపా అధిష్ఠానాన్ని కోరారు. కానీ సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో అవంతి శ్రీనివాసరావు భీమిలి సీటు కోసం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. దాంతో భీమిలిలో అవంతికి గట్టి పోటీ ఇవ్వగల నాయకుని కోసం తెలుగుదేశం అన్వేషణ ప్రారంభించింది.
అనూహ్యంగా తెర పైకి హరి
సబ్బం హరి యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన స్వస్థలం చిట్టివలస. విశాఖలో స్థిరపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ ఉద్దండులైన ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు, తదితరులతో పోటీ పడి వ్యూహాలు నడిపారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ నగర మేయర్‌గా పనిచేసిన ఆయన ప్రజలకు గుర్తుండిపోయే సేవలు అందించారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖ-1 నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడైన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో విభేదాలు వచ్చి కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. 2009లో అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ సాధించి ఊహించని విధంగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున సినీ నిర్మాత అల్లు అరవింద్‌, తెలుగుదేశం పార్టీ తరపున ఓ పత్రిక అధిపతి నూకారాపు సూర్యప్రకాశరావులు పోటీ చేయగా సబ్బం హరి 52,912 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేదు. 2014 ఎన్నికల్లో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరి విశాఖ ఎంపీగా బరిలో దిగారు. పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి తటస్థంగా వుంటూ ఇటీవల తెలుగుదేశం వైపు ఆకర్షితులై...ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాఖ ఎంపీగా గానీ, విశాఖ ఉత్తర నుంచి గానీ అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పార్టీ సమీకరణాల నేపథ్యంలో హరికి టీడీపీ భీమిలి టిక్కెట్‌ కేటాయించింది.
పోటాపోటీ
గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో భీమిలిలో అవంతి శ్రీనివాసరావుకు దీటైన అభ్యర్థి కోసం చూస్తున్న టీడీపీ ఎవరూ ఊహించని విధంగా సబ్బం హరిని రంగంలోకి దించింది. ఇప్పుడు అక్కడ నువ్వా? నేనా? అనే పోటీ నెలకొంది. అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే ఒకసారి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అది ఆయనకు ప్లస్‌ పాయింట్‌గా మారింది. దాంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. సబ్బం హరి విషయానికి వస్తే స్థానికుడు కావడం కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే గత రెండు దశాబ్దాలుగా ప్రతి వారం భీమిలి వెళ్లి...స్థానిక నాయకుల్ని కలిసి మంచిచెడ్డల గురించి మాట్లాడుతుంటారు. వారి సమస్యలకు తనకు తోచిన పరిష్కారం చూపిస్తుంటారు. అలా ఆయనకు అక్కడ అనుచరులు, అభిమానులు ఉన్నారు. అది ఆయనకు ఇప్పుడు కలిసి వస్తోంది.