స‌త్తా బ‌జార్ మాట‌.... దేశంలో గెలుపు ఎవరిదంటే...?

July 03, 2020

ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌ప్పించి జ‌నాల‌కు ఇంకేది విన‌ప‌డ‌టం లేదు. ఎంత‌టి ప్రాధాన్యం క‌లిగిన వార్త‌లు ఉన్నా కూడా ఎన్నిక‌ల వార్త‌ల‌ను బీట్ చేయ‌లేక‌పోతున్నాయి. ఈ క్ర‌మంలో నిత్యం బెట్టింగురాయుళ్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే స‌త్తా బ‌జార్లు సైతం పాలిటిక్స్ పై దృష్టి సారించాయి. స‌త్తా బ‌జార్ల‌లోని బెట్టింగ్ రాయుళ్లు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన విశ్లేష‌ణ‌లు త‌ప్పించి మ‌రే విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిద‌న్న విష‌యంపై స‌త్తా బ‌జార్ల‌లో భారీ ఎత్తున బెట్టింగ్ లు జ‌రుగుతున్నాయి. మొత్తం ఏడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే ఐదు ద‌శ‌ల పోలింగ్ ముగియ‌డం, ఇంకా రెండు ద‌శ‌లు మాత్ర‌మే మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఈ బెట్టింగులు మ‌రింత‌గా జోరందుకున్నాయి.

ఎన్డీఏ గెలుపుపై ఏ మేర బెట్టింగులు క‌డుతున్నారో, యూపీఏ విజ‌యావ‌కాశాల మీద కూడా అంతే స్థాయి బెట్టింగ్ జ‌రుగుతోంది. ఎన్డీఏపై కాసే బెట్టింగుల‌కు 11 రెట్ల సొమ్ము ఇస్తామంటున్న పంట‌ర్లు... యూపీఏపై కాసే బెట్టింగుల‌కు ఏకంగా 33 రెట్ల సొమ్ము ఇస్తామంటూ త‌మ‌దైన శైలి బెట్టింగుల‌కు తెర తీసేశారు. మొత్తంగా ఇప్పుడు స‌త్తా బ‌జార్ల‌లో ఈ బెట్టింగుల విలువ ఇప్ప‌టికే రూ.12 వేల కోట్ల మేర‌కు చేరింద‌ట‌. మిగిలి ఉన్న రెండు ద‌శ‌ల పోలింగ్ కూడా ముగిసేలోగా ఈ బెట్టింగుల మొత్తం ఏ స్థాయికి చేరుకుంటుందోన‌న్న విష‌యం అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎన్డీఏ, యూపీఏల మీద బెట్టింగులు కాస్తున్న స‌త్తా బ‌జార్ బెట్టింగ్ రాయుళ్లు... లోక‌ల్ పార్టీల‌పైనా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ట‌.

స‌రే... బెట్టింగుల జోరు ఎలాగూ ఉండేదే గానీ... ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌త్తా బ‌జార్ మాట ఏమిట‌న్న‌ది కూడా ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఇటు ఎన్డీఏతో పాటు అటు యూపీఏ కూడా అధికారం చేప‌ట్టే అవ‌కాశాలు లేవ‌ట‌. ఈ రెండు కూట‌ముల్లో ఏ కూట‌మికి కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని స‌త్తా బ‌జార్ తేల్చేసింది. ప్ర‌స్తుతం అధికార కూట‌మిగా ఉన్న ఎన్డీఏకు ఈ ఎన్నిక‌ల్లో 185 నుంచి 220 సీట్ల మేర వ‌స్తాయ‌ని, అదే యూపీఏ కూట‌మికి 160 నుంచి 180 సీట్ల దాకా వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని స‌త్తా బ‌జార్ అంచనా వేస్తోంది. \

ఈ లెక్క‌న ఈ రెండు కూట‌ముల‌కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాద‌న్న మాట‌. మ‌రి ఎవ‌రికి అవ‌కాశాలున్న‌ట్లు? ఇంకెవ‌రికి ప‌లు ప్రాంతీయ పార్టీల‌తో రంగంలోకి దిగిపోయిన మ‌హా కూట‌మికేనా? అంటే... అవున‌న్న మాటే చెబుతున్న స‌త్తా బ‌జార్‌... ఈ కూట‌మిలోని ప‌లు పార్టీల‌ను ఆక‌ర్షించే మోదీ ఎలాగోలా కేంద్రంలో మ‌రోమారు అధికారం చేపడ‌తార‌ని చెబుతోంది. అయితే ఇప్పుడు మిగిలిన రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నున్న 118 సీట్లే అస‌లు భ‌విష్య‌త్తును నిర్దేశిస్తాయ‌ని స‌త్తా బజార్ త‌న అంతిమ మాట‌గా చెబుతోంది. మొత్తంగా స‌త్తా బ‌జార్ అంచనాలు జ‌నంలో అమితాస‌క్తిని రేకెత్తిస్తున్నాయ‌నే చెప్పాలి.