మోడీపై రాశారా? మోడీ రాయించుకున్నారా?

July 08, 2020

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై నిప్పులు జిమ్మే క‌థ‌నాలు మ‌న ద‌గ్గ‌ర త‌క్కువే. ఆయ‌న్ను సూటిగా విమ‌ర్శిస్తూ.. ఘాటుగా ఎండ‌గ‌డుతూ.. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ప్రధాన క‌థ‌నంగా అచ్చేయ‌టం ఈ మ‌ధ్య‌న చూసింది లేదు. అలాంటివేళ‌.. అమెరికా నుంచి వెలువ‌డే టైమ్ మ్యాగ్ జైన్ ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని క‌వ‌ర్ పేజీ స్టోరీగా ప‌బ్లిష్ చేసింది. భార‌త‌దేశ విచ్చిన్న వాది అన్న వివాదాస్ప‌ద హెడ్డింగ్ పెట్టిన టైమ్.. అదే ప‌త్రిక‌లో మోడీ సంస్క‌ర‌ణ‌వాదిగా పేర్కొంటూ మ‌రో అనుకూల క‌థ‌నాన్ని అచ్చేసింది.

మోడీలోని నెగిటివ్ కోణాన్ని.. పాజిటివ్ కోణాన్ని ట‌చ్ చేసిన‌ట్లుగా చూపించిన‌ప్ప‌టికీ.. నెగిటివ్ క‌థ‌నానికి భారీ ప్రాధాన్య‌త క‌ల్పించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం మోడీ ప్ర‌భుత్వాన్ని మ‌రో ఐదేళ్లు భ‌రించ‌గ‌లదా? అంటూ హెడ్ లైన్ ఇచ్చిన క‌థ‌నంలో మోడీ వైఫ‌ల్యాల్ని.. ఆయ‌న పాల‌నా తీరును ఎండ‌గ‌ట్టారు. 

ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో ఆయ‌న చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపించారు. మిగిలిన ప‌క్షాల మ‌ధ్య విభేదాల‌ను సానుకూలంగా మ‌ల్చుకొని ఒక ఆశావాహ వాతావ‌ర‌ణాన్ని  2014లో మోడీ సృష్టించార‌ని.. ప్ర‌స్తుతం (2019) అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. ఆశ లేదు.. అంతా నిస్పృహ ఉంద‌న్న స‌ద‌రు క‌థ‌నంలో మోడీ హామీలు అమ‌లు చేయ‌లేని ఒక విఫ‌ల రాజ‌కీయ‌వేత్త‌గా పేర్కొనటం గ‌మ‌నార్హం.

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ ఆతిష్ త‌సీర్ రాసిన ఈ క‌థ‌నంలో.. మోడీ పాల‌న‌లో ఉదార‌వాదులు మొద‌లు నిమ్న కులాల వారు.. ముస్లింలు.. క్రైస్త‌వులు లాంటి అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల‌న్నీ దాడులు ఎదుర్కొంటున్నాయ‌ని స‌ద‌రు క‌థ‌నంలో పేర్కొన్నారు. 2014 ఎన్నిక‌ల్లో మోడీ చెప్పిన ఆర్థిక విధానాలు అద్భుతాలు సృష్టించ‌టం మాట అటు ఉంచి.. ఏవీ వాస్త‌వ‌రూపం దాల్చ‌టం లేద‌న్నారు. యోగి ఆదిత్య‌నాథ్ లాంటి విద్వేషాన్ని విర‌జిమ్మే వ్య‌క్తి సీఎం అయ్యార‌ని.. మాలెంగాం పేలుళ్ల కేసులో నిందితురాలైన ఓ సాధ్విని ఎన్నిక‌ల్లో నిల‌బెట్ట‌టాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఇంత తీవ్ర విమ‌ర్శ‌ల‌తోనూ.. ఆరోప‌ణ‌ల‌తోనూ క‌వ‌ర్ పేజీ స్టోరీగా ప్ర‌చురిత‌మైన వేళ‌.. దాన్ని బ్యాలెన్స్ చేయాల‌న్న భావ‌న టైమ్ మీడియా సంస్థ ఫీల్ కావ‌టం విశేషం. ఇంత తీవ్రంగా మోడీని త‌ప్పు ప‌ట్టిన టైమ్.. అదే మ్యాగ్ జైన్ లోని మ‌రో క‌థ‌నంలో ఆయ‌న్ను సంస్క‌ర‌ణ‌వాదిగా అభివ‌ర్ణించారు. చురేషియా గ్రూప్ అధ్య‌క్షుడు ఇయాన్ బ్రెమ‌ర్ రాసిన క‌థ‌నంలో మోడీ ఆర్థిక విధానాలు మిశ్ర‌మ ఫ‌లితాల్ని ఇచ్చాయ‌ని.. అయితే భార‌త్ లో మార్పు మ‌రింత రావాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. పాజిటివ్ క‌థ‌నం మోడీ మేక‌ప్ ను చెరిపేసి.. అస‌లు ముఖాన్ని నెగిటివ్ స్టోరీ చూపించింద‌న్న భావ‌నను టైమ్ క‌లిగేలా చేసింద‌ని చెప్పాలి.  

ఇదంతా చూస్తుంటే... ఉద్దేశ పూర్వకంగా రాసిన మోడీ కోసం కవర్ స్టోరీయే గాని మోడీపై రాసిన కవర్ స్టోరీ కాదని అర్థమవుతోంది. మోడీ అంతర్జాతీయ పత్రికను మేనేజ్ చేయగలిగారంటే ఆశ్చర్యకరమే మరి.