ఎవరి సొమ్ము ఎవరికిస్తారు?

August 08, 2020
రాష్ట్రంలో చట్టపాలన ఉందా?
ఒకరి భూమి తీసుకుని మరొకరికి అప్పగిస్తారా?
భూములు ఇవ్వని ఎస్సీ, ఎస్టీలపై కేసులా?
అసైన్డ్‌ భూముల్లో పోలీసులకేం పని?
ఇలాగైతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాం
రికార్డుల్లో పేర్లు తారుమారు చేస్తున్నారు
బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు
రాజధాని భూములిచ్చే అధికారం మీకు లేదు
అభివృద్ధి పనులు మరిచి... పంపిణీయా?
హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం 
పేదల ఇళ్ల స్థలాల పేరిట పేదలకే చెందిన అసైన్డ్‌ భూములు స్వాధీనం చేసుకోవడం! కనీస సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లు, పొక్లయిన్లతో దొంగల్లా వచ్చి.. పంట భూములు చదును చేసి ప్లాట్లు గుర్తించడం.. పోలీసులతో రంగంలోకి దిగి... కేసులు పెడతామని హెచ్చరించడం! నవ్యాంధ్రలో ఇంటి స్థలాల కోసం జరుగుతున్న భూసేక‘రణం’ ఇది! ఈ తంతుపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మండిపడింది. ‘ఇళ్ల స్థలాల పంపిణీ’ పేరుతో ఒకరి భూమిని తీసుకుని మరొకరికి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో పంపిణీ చేసిన భూములకు పరిహారం చెల్లించి వెనక్కి తీసుకోవడం... వాటిని మళ్లీ వేరొకరికి ఇవ్వడమంటే ట్యాక్స్‌ పేయర్ల సొమ్ము (ప్రజా ధనం)ను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న అసైన్డ భూముల్ని బలవంతంగా తీసుకుని వేరొకరికి ఎలా కేటాయిస్తారని నిలదీసింది. ‘తమ అసైన్డ భూముల్ని అప్పగించేందుకు అంగీకరించని ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెడతారా? ఇది సరైనా చర్యేనా? కొందరు రెవెన్యూ అధికారులు భూరికార్డుల్లో పేర్లను తారుమారు చేస్తున్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తప్పవు. వారిపై 467, 468 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటాం. అసలు రాష్ట్రంలో చట్ట నిబంధనలు అమలవుతున్నాయా? ఇది రాష్ట్రమా మరేమైనానా? అసైన్డ భూముల్లోకి పోలీసులు వెళ్లి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. వారికి అక్కడేం పని? పోలీసుల చర్యలు హద్దు మీరుతున్నాయని, ఇలాగైతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాం’ అని హెచ్చరించింది. మిగతాది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు కోర్టులోనే అక్షింతలు వేసింది. ఇళ్ల స్థలాల కోసం ఆయా భూముల్లో ఉన్న చెట్లను నరకడం నేరమని, సుప్రీంకోర్టు సైతం దీనిని తీవ్రంగా పరిగణించిందని ధర్మాసనం గుర్తు చేసింది. చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చినందున ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మరోవైపు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు హడావుడిగా భూములు సమీకరిస్తున్నారని తప్పుబట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని... కనీస హెచ్చరికలు లేకుండానే భూములు లాక్కుంటోందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతూ పై ఆదేశాలిచ్చింది.
ఇళ్ల స్థలాల కోసం మీ జేబులోంచి ఇవ్వండి
రాజధాని భూములు ఇతరులకు ధారదత్తం చేయాలని చూడడంపైనా హైకోర్టు విరుచుకుపడిది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే మీ (ప్రభుత్వం) జేబు నుంచి ఇవ్వండి. అంతే తప్ప రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇవ్వడం సరి కాదు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. సీఆర్‌డీఏ ముందస్తు ప్రణాళిక ప్రకారం రాజధాని అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా... ఆ విషయాన్ని వదిలేసిన ప్రభుత్వం, సమీకరించిన భూమిలో 5 శాతాన్ని ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం ఎంత వరకు భావ్యం? రాజధానిలో ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఐదేళ్ల తరువాత ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తే ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను దాటవేస్తోంది. దీనిని అనుమతించలేం’ అని తేల్చిచెప్పింది. ఇతర ప్రాంతాల పేదలకు రాజధానిలో భూములివ్వడం వెనుక కుట్ర దాగి ఉందని హైకోర్టు కూడా గ్రహించినట్లు కనబడుతోంది. నిజానికి తలో సెంటు చొప్పున అక్కడ భూములిచ్చి.. వాటిని అధికార పార్టీ పెద్దలు స్వాధీనం చేసుకుంటారు. ఐదేళ్ల తర్వాత విక్రయించుకోవచ్చన్న నిబంధన పెట్టింది అందుకే. స్థలాలిచ్చేటప్పుడే ఎంతో కొంత మొత్తం లబ్ధిదారుల చేతుల్లో పెట్టి వాటిని ముందే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రాజధాని కోసం సమీకరించిన భూమిలో 1251 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ గత 25వ తేదీన జారీ చేసిన జీవో 107ను ధర్మాసనం కొట్టివేసింది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద లబ్ధిదారులకు ఇస్తున్న స్థలాన్ని ఐదేళ్ల తరువాత విక్రయించుకునేందుకు వీలు కల్పించడాన్ని కూడా ఆక్షేపించింది. ఇల్లు నిర్మించుకోవాలన్న షరతు లేకుండా ఆ స్థలం ఎలా కేటాయిస్తారని నిలదీసింది. లబ్దిదారుల పేరు మీద తహశీల్దార్లకు సంయుక్త సబ్‌ రిజిసా్ట్రర్‌ హోదాలో ఆస్తిమార్పు దస్తావేజులు (కన్వేయన్స డీడ్స్‌) రిజిసే్ట్రషన చేసేందుకు అధికారం కల్పిస్తూ గత ఫిబ్రవరి 12వ తేదీన ఇచ్చిన జీవో 44ని నిలిపివేసింది.