జగన్ ను అక్కినేని నాగార్జున ఎందుకు కలిసాడు ?

May 29, 2020

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు అంతుచిక్కడం లేదు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆకర్షిస్తుంటే.. మరోవైపు వైసీపీ అధినేత కొత్త కొత్త నేతలను తన పార్టీ లోకి స్వాగతిస్తూ వైసీపీలో నూతన వెలుగులు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా వైసీపీలో చేరబోతున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి.

తాజాగా అక్కినేని నాగార్జున- జగన్ భేటీ ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ పలు చర్చలకు దారితీస్తోంది. వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లోని ఆయ‌న‌ నివాసంలో నాగార్జున కలవటం, ఆ వెంటనే ఈ ఇష్యు హాట్ టాపిక్ గా మారిపోవటం చక చకా జరిగిపోయాయి. వీరిద్దరూ దాదాపు అర‌గంట పాటు స‌మావేశమయ్యారు. ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన‌ట్లు ఈ సమావేశంలో చర్చించినట్లు స‌మాచారం. జ‌గ‌న్‌తో భేటీ త‌ర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. దీంతో అసలు ఈ భేటీకి కారణాలేంటి? అనే కోణంలో వార్తలు ఊపందుకున్నాయి.

వైసీపీ తరఫున గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేయబోతున్నారని వార్తలు జోరందుకున్నాయి. అయితే నాగార్జునకు రాజకీయాల్లో నెగ్గుకొచ్చే చతురత లేదని, ఆయన్ను రాజ్యసభ్యకు పంపే అవకాశం ఉందనే ప్రచారం సైతం వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి అక్కినేని నాగార్జున ముందు నుంచీ రాజకీయాలంటే అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆయన వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి భేటీ హాట్ టాపిక్ అయింది. నాగార్జున మేనల్లుడు సుమంత్ ద్వారా నాగార్జున, జగన్ మధ్య దోస్తీ కుదిరిందనే మరో సమాచారం బాగా చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి చివరకు ఎలాంటి షాకింగ్ ప్రకటన వెలువడుతుందో!