అమరావతి కుదించడం వెనుక కుట్ర ఇదేనా?

February 25, 2020

రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... 13 జిల్లాల ప్రజలకు ఆమోదయోగ్యమయ్యేలా, రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటన చేయడమే ఆలస్యం ఆయన ఒక్క పిలుపుతో రైతులు దాదాపు 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు. ఇక అక్కడ నుంచి చంద్రబాబు...అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులాంటివి నిర్మాణాలు చేశారు. అలాగే పాలన పరంగా కావల్సిన భ‌వ‌నాల‌ నిర్మాణం కూడా మొదలుపెట్టారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో అనుకున్నదానికంటే ఎక్కువే అమరావతి అభివృద్ధి చేశారు. అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతి నిర్మాణం చేస్తే ప్రజలకు చంద్రబాబు పేరే గుర్తొస్తుందనే భావనతో దాన్ని మార్చడానికి అనేక ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజూ ఇవే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఈ ఆరోపణలు నిరూపించమని టీడీపీ చాలా సార్లు సవాళ్ళు విసిరింది.

ఇక వాటిని నిరూపించేందుకు జగన్ ప్రభుత్వం... రాజధానిపై కమిటీ వేసింది, ఐ‌ఏ‌ఎస్‌లపై ఒత్తిడి చేసింద‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఏదోలా ఆరోప‌ణ‌లు చేసి బాబును బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు వెళ్లింద‌న్న చ‌ర్చ‌లు కూడా వ‌చ్చాయి. ఇంత చేసినా అక్రమాలపై ఏమి నిగ్గు తేల్చలేకపోయారు. ఇప్పటికీ జగన్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావొస్తుంది. ఈ ఏడు నెలల్లో టీడీపీ మీద ఆరోపణలు చేయగలిగారుగానీ నిరూపించలేకపోయారు. మరోవైపు రాజధాని నిర్మించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

అయితే ప్రభుత్వానికి అమరావతి నిర్మించడం ఇష్టంలేదన్న‌ట్టుగా ఆ పార్టీ మంత్రులు, నేత‌ల వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మీద కోపంతో అమరావతి విలువని తగ్గించడానికి జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి, కర్నూలు, విశాఖపట్నాలని రాజధానులుగా చేయాలనుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ మూడు రాజధానులపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకిత వస్తుంది. కాబట్టి ఈ మూడు రాజధానులు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం లేద‌నే వైసీపీతో పాటు రాష్ట్రంలో మెజార్టీ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఏ ప్లాన్‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్నారో..?