ఊరంతా ఒక‌వైపు.. అయినా బాబులో బెదురు లేదు

October 17, 2019

ఒక ప్ర‌ధాని ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై క‌క్ష తీర్చుకోవాల‌నుకుంటే అది పెద్ద ప‌ని కాదు. కానీ... అక్క‌డున్న‌ది సాధార‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడు కాదు. జీవితంలో ఏ క‌ష్ట‌మూ లేకుండా, ఏ క్లిష్ట‌త లేకుండా ఏ రోజూ బ‌త‌క‌ని చంద్ర‌బాబు. ప్ర‌తి క్ష‌ణం ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పోరాటంలో బ‌తికిన చంద్ర‌బాబు క‌ష్టాలు కాక‌ర‌కాయ‌లు కాదు, కాకినాడ ఖాజాలు. అందుకే ఒక ప్ర‌ధాని ఆయ‌న పూర్తి మ‌ద్ద‌తు ఉన్న ప్ర‌తిప‌క్ష నేత‌, సంపూర్ణ మెజారిటీతో ఉన్న పొరుగురాష్ట్రం ఒక్క‌టై చంద్ర‌బాబు మీద యుద్ధం చేస్తున్నాయి. కానీ ఆ భ‌యం బెరుకు మాత్రం చంద్ర‌బాబులో క‌నిపించ‌డం లేదు. ఎందుకు, బాబులో ఇంత భ‌రోసా?

త‌ర‌చి చూస్తే... చాలానే ఉన్నాయి. మ‌చ్చుకు కొన్ని మాట్లాడుకుంటే... చంద్ర‌బాబులోని టెక్ బాబు, సీఈవో బాబు, సంక్షేమ బాబు... ఒక్క‌టై ఈసారి రాష్ట్రాన్ని పాలించారు. ప్ర‌తి ద‌శ‌లో ప్ర‌తి వ‌ర్గంలో, ప్ర‌తి ఊరిలో, ప్ర‌తి ఇంటిలో చంద్ర‌బాబు ప‌థ‌కం అంద‌ని పౌరుడే లేని స్థాయిలో ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం ఒక ఎత్తు. భారీ లోటు బ‌డ్జెట్‌తో బాబు ఇవ‌న్నీ చేయ‌డం ఒకెత్తు. అందుకే మాస్ హీరో ఫ్యాన్స్ హ‌డావుడి త‌ప్పెట మోత‌ల్లా వినిపించినా... సైలెంటు ఓట‌రు, మ‌హిళా ఓట‌రు అత్య‌ధిక శాతం బాబు వైపు ఉన్న‌ట్టు టీడీపీ స‌ర్వేలో తేలిన ప‌చ్చినిజం. అందుకే చంద్ర‌బాబు చాలా తాపీగా టిక్కెట్లు ప్ర‌క‌టించుకుంటూ పోతున్నారు. బ‌హుశా రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇంత ముందుగా టిక్కెట్లు ప్ర‌క‌టించడం చాలా అరుదు. కానీ జంపింగ్‌ల‌కు జంక‌డం లేదు. బెదిరింపుల‌కు బెద‌ర‌డం లేదు. గెలుపు గుర్రాల‌కు ప‌నిచేసిన వారికి టిక్కెట్లుఇస్తున్నాడు. ఈసారి బాబును బాబు న‌మ్ముకుంటున్నాడు. అంతేగాని ఎమ్మెల్యేల‌ను కాదు. అందుకే ఈ స్థాయిలో దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. 2019లో ఇంత‌వ‌ర‌కు ఎంత మంది టీడీపీ వీడినా ఎవ‌రినీ పార్టీలో ఉండ‌మ‌ని బ‌తిమాలిన దాఖ‌లాలు లేవు. స్క్రాప్ పోతే పార్టీని ఎన్నిక‌ల పండుగ‌కు శుభ్రం చేసుకుని పెట్టుకుందాం అని చంద్ర‌బాబు సిద్ధ‌మైపోయారు. ఏదీ నాన్చ‌డం లేదు. ఫ‌టాఫ‌ట్‌. ధ‌నాధ‌న్‌. హ‌డావుడి ప‌క్క‌న పెట్టి సైలెంటుగా ప‌నిచేసుకోండ‌ని క్యాడ‌ర్‌ను భుజం త‌ట్టి పంపిస్తున్నార‌ట స‌మీక్ష‌ల్లో చంద్ర‌బాబు.