లూసిఫర్ రీమేక్ అతడి చేతుల్లో ఎందుకు పెట్టారు?

August 10, 2020

గత ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మోహన్ లాల్ సినిమా ‘లూసిఫర్’ తెలుగులోకి కూడా అనువాదం అయింది. థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమేజాన్‌లోకి కూడా వచ్చింది. అయినా సరే.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ను రీమేక్ చేయడానికి ఆయన తనయుడు రామ్ చరణ్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ విషయంలో సోషల్ మీడియాలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా సరే.. చిరు అండ్ కో వెనక్కి తగ్గట్లేదు. ఆ రీమేక్ విషయంలో చిరు కూడా పట్టుదలతోనే ఉన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ విషయంలో ఆసక్తితో ఉన్నాడటగా అని అడిగితే.. దాని గురించి తెలియదు కానీ.. ఈ రీమేక్ మాత్రం తానే చేస్తున్నట్లు చిరు వెల్లడించాడు.

ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది చిరు ఇంకా వెల్లడించలేదు. ఇంతకుముందు సుకుమార్‌ను సంప్రదించారని.. ఆయన ఒరిజినల్‌ చూసి తన వెర్షన్ రాసి ఇచ్చారని ప్రచారం జరిగింది. ఐతే సుక్కు రేంజ్ ప్రకారం చూస్తే ఆయన రీమేక్‌ను డైరెక్ట్ చేయడం సందేహమే. మరి ‘లూసిఫర్’ రీమేక్‌ను తెరకెక్కించేదెవరన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా ఇప్పుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్ పేరు వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్లెవరూ అందుబాటులో లేకపోవడంతో సుజీత్‌ను పిలిచి ‘లూసిఫర్’కు తెలుగు వెర్షన్ స్క్రిప్టు రాయమని అడిగాడట చిరు. ఇప్పుడతను ఆ పనిలోనే ఉన్నట్లు సమాచారం. ‘రన్ రాజా రన్’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజీత్‌కు అనుకోకుండా రెండో ప్రయత్నంలో ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ అతను దాన్ని సరిగా డీల్ చేయలేకపోయాడు. తర్వాత సుజీత్‌ పరిస్థితి ఏంటన్నది అర్థం కాలేదు. ఐతే రీమేక్ అయినా సరే.. చిరుతో పని చేేసే అవకాశం అంటే సుజీత్‌ వదులుకోకపోవచ్చు. చిరును మెప్పించే స్క్రిప్టునే అతను సిద్ధం చేసే అవకాశముంది.