' గంటా ' యూట‌ర్న్ వెన‌క‌...!

February 26, 2020

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు యూట‌ర్న్ తీసుకున్నారా..?  నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు గంటా శ్రీ‌నివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని, అందుకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితో మంత‌నాలు పూర్త‌య్యాయ‌ని... సీఎం జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది. సోష‌ల్ మీడియాలో గంటా శ్రీనివాస‌రావు పార్టీ మారుతున్నాడ‌ని ట్రోలింగ్‌కు గుర‌య్యారు. కానీ అనుకోకుండా మ‌న‌స్సు మార్చుకున్నార‌ట‌. అందుకు కార‌ణం మెగాస్టార్ చిరంజీవే కార‌ణ‌మ‌ని ఇప్పుడు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కు ఏమి జ‌రిగిందో ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన గంటా శ్రీ‌నివాస్‌రావు వెంట‌నే వైసీపీలో చేరే విష‌యంలో యూ ట‌ర్న్ తీసుకుని టీడీపీలోనే కొన‌సాగేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌.
అందుకు నిద‌ర్శ‌నంగా గంటా శ్రీ‌నివాస‌రావు ఈరోజు విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి హాజ‌రై అంద‌రికి షాక్ ఇచ్చారు. గ‌త కొంత కాలంగా మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీలోకి వెళుతార‌నే టాక్ వినిపించింది. అందుకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి గంటాతో మంత‌నాలు జ‌రిపారు. సీఎం జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. అయితే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని జ‌గ‌న్ ష‌ర‌తు పెట్టారు.
అయితే గంటా వైసీపీలోకి వ‌స్తున్న సంకేతాలు రావ‌డంతో మంత్రి అవంతి శ్రీ‌నివాస‌రావు గంటా శ్రీ‌నివాస‌రావుపై విమ‌ర్శ‌ల జ‌డివాన కురిపించారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లుకూడా చేశారు. అయితే దీనికి ప్ర‌తిగా గంటా అవంతికి భారీ కౌంట‌ర్ ఇచ్చారు. అయితే తాడేప‌ల్లిగూడెంలో జ‌రిగిన మ‌హాన‌టుడు ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ గంటా రాజ‌కీయ జంపింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింద‌ట‌. ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజ‌ర‌య్యారు. చిరంజీవితో పాటు గంటా శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు. మొత్తం చిరంజీవి వెంట ఉన్న గంటా రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. అందుకే మెగాస్టార్ సూచ‌న మేర‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో పాటు కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల‌న్న సల‌హా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.
దీంతో త‌న ఆప్త‌మిత్రుడు అయిన చిరంజీవి మాట‌ను కాద‌ల‌న‌లేక గంటా శ్రీ‌నివాస‌రావు పార్టీ మార్పు ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఆయ‌న టీడీపీ స‌మ‌న్వ‌య స‌మావేశానికి హాజ‌రై అంద‌రికి సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీలోనే కొన‌సాగే గంటా శ్రీ‌నివాస‌రావు ఇక టీడీపీ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్నార‌ట‌. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారరయ్యాయి. ఈ నెల 10, 11న విశాఖ జిల్లా, 21, 22న శ్రీకాకుళం జిల్లాలో బాబు పర్యటించనున్నారు. దీంతో గంటా పార్టీ ప‌రంగా యాక్టివ్ కానున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు తేట‌తెల్లం చేస్తున్నాయి. ఇక గంటా టీడీపీలోనే ఉండి వైసీపీ ప్ర‌భుత్వంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...!