జగన కూతుర్ల గురించి ఆ వార్త బయటకు రాలేదు

June 03, 2020

మొండోడు రాజు కంటే బలవంతుడంటారు.. ప్రపంచ దేశాధినేతల్లోనూ ఇలాంటి క్యారక్టర్లు చాలా కనిపిస్తున్నాయి. ప్రపంచాన్నే శాసించే స్థితిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు సైతం కరోనాకు భయపడుతున్నారు... ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కెనడా ప్రధాని భార్యకు కరోనా సోకితే ఆయనా పరీక్షలు చేయించుకుని 14 రోజుల క్వారంటీన్‌కు వెళ్లారు. బ్రెజిల్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీంలీడర్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రధానులు, అధ్యక్షులు, మంత్రులు కూడా ఏ చిన్న అనుమానం వచ్చినా... తాము కలిసినవారిలో ఎవరికైనా కరోనా ఉందన్న అనుమానం ఉన్నా... కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారిని కలిసినా పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరు సొంతంగా గృహనిర్బంధంలోకి వెళ్తున్నారు.
అంతెందుకు మన దేశంలోని నాయకులూ జాగ్రత్తలు తీసుకుని తమ ద్వారా ఇతరులకు ఆ రోగం వెళ్లకుండా బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ అయితే తన సోదరి అమెరికా నుంచి రావడంతో ఆమెను 14 రోజుల పాటు తన ఇంట్లోనే‌ హోం క్వారంటీన్‌లో ఉంచారు. తెలంగాణ సీఎం స్వయంగా రంగంలో దిగి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రజలకు సూచనలు చేస్తూ కరోనా కట్టడికి మంచి చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే మాత్రం ఎందుకో ఆయన కరోనాకు ఏమాత్రం భయపడుతున్నట్లుగా కానీ, జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కరోనా కారణంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే జగన్, ఆయన మంత్రులు, నాయకులు అంతా కరోనా లేదు గిరోనా లేదు అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. అంతేకాదు.. జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల నుంచి వచ్చారు. ఒకరు యూకే నుంచి మరొకరు యూఎస్ నుంచి వచ్చారు. కానీ, వారిని క్వారంటీన్‌కు పంపారా.. టెస్టులు చేశారా అన్న సమాచారమేదీ జగన్ ప్రజలకు తెలియపర్చలేదు. అలా చేసి ఉన్నా.. ఆ సమాచారం ప్రజలకు ఇచ్చినా అది ప్రజల్లో స్ఫూర్తి నింపేది, తాము కూడా జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న బాధ్యతను ప్రజల్లో పెంచేది.
అంతేకాదు.. కరోనా సమయంలో ఇద్దరు కుమార్తెలు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినా జగన్ దంపతులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోలేదు. ఒకవేళ చేయించుకున్నా బయటకు వెల్లడించలేదు. జగన్ నిత్యం అధికారులు, పార్టీ నాయకులను కలుస్తూనే ఉన్నారు. ఇది అతివిశ్వాసమా.. అజాగ్రత్తా.. లేదంటే... రహస్యంగా పరీక్షలు చేయించుకుని తాము సురక్షితంగా ఉన్నాం, తమ నుంచి ఎవరికీ వ్యాపించే ప్రమాదం లేదని తెలుసుకుని ఇలా వ్యవహరిస్తున్నారా అన్నది ముఖ్యమంత్రికే తెలియాలి.