​జగన్ లేఖ రాయకపోవడం వల్ల లక్ష కోట్ల నష్టం

July 05, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఏపీకి లక్ష కోట్ల నష్టం వాటిల్లడానికి కారణం అయ్యారు. అచ్చం చంద్రబాబులాగే నిర్లక్ష్యం చేస్తూ ఆయన చంద్రబాబు లాగే పెద్ద తప్పు చేసి ఏపీకి తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టారు. ఇంతకీ బాబు, జగన్ ఏం తప్పు చేశారనేగా మీ అనుమానం.
2014లో ఎన్నికల్లో మోడీ గెలిచినా ప్రణాళిక సంఘం రద్దు చేయడానికి ఏడు నెలలు పట్టింది. అపుడు ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక సంఘానికి ’’మీ దగ్గర మా ప్రత్యేక హోదా ఫైలుంది. మీరు మరిచిపోయినట్టున్నారు. వెంటనే ఆ ఫైలు మీద సంతకం పెట్టేసి మాకు ప్రత్యేక హోదా ఇచ్చేసేయండి‘‘ అని లేఖ రాయకపోవడం వల్ల మనం ప్రత్యేక హోదా మిస్సయ్యాం. ఈ విషయాన్ని ఇప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో స్వయంగా చెప్పారు. చంద్రబాబు తప్పును గుర్తించగలిగిన వైఎస్ జగన్ తన పని మరిచిపోయారు.
2019లో బీజేపీ గెలిచాక మన తెలుగు ఇంటి కోడలు, ఆర్థిక మంత్రి అయిన నిర్మల సీతారామన్ కు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాయలేదు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో పోలవరానికి పెండింగ్ లో ఉన్న 45 వేల కోట్లు గురించి, వివిధ కేంద్ర విద్యాసంస్థలకు పెండింగ్ ఉన్న 10 వేల కోట్లు, రాజధాని నగరం కట్టడానికి డబ్బులు, రెండు పోర్టులు, నాలుగు జాతీయ రహదారులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఉన్న వేల కోట్లు అన్నిటికి వెంటనే డబ్బులు ఇచ్చేయమని లేఖ రాయడం మరిచిపోయారు. అసలే తెలుగు కోడలు కాబట్టి జగన్ ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాసి ఉంటే అటు ఇటుగా మనకు ఈ బడ్జెట్లో లక్ష కోట్లు శాంక్షన్ చేసి పారేసేవారు ఆర్థికమంత్రి నిర్మల. మన కష్టాలన్నీ తీరిపోయేవి. పోలవరం కట్టుకునేవాళ్లం. రోడ్లు వేసుకునే వాళ్లం. అమరావతి కట్టుకునే వాళ్లం. మద్యనిషేధం వల్ల పోయిన ఆదాయం అంతా ఇక్కడ పూడేది. ఇపుడు చూడండి మన ముఖ్యమంత్రి జగన్ సీఎం హోదాలో ఆర్థిక మంత్రికి లేఖ రాయకపోవడం వల్లే మనకు సుమారు లక్ష కోట్లు రాకుండా పోయాయి. ఈ పెద్ద మనిషి ఎందుకు లేఖ రాయడం మరిచిపోయారు? ఎంత పని చేశావు జగన్ రెడ్డి. 40 రోజులు గ్యాప్ లో బడ్జెట్ లో మనకు డబ్బులు ఇవ్వమని చిట్టా ఎందుకు పంపుతూ లేఖ రాయలేదు? చూశారా ఇపుడు అస్సలు డబ్బుల రాలేదు మనకు!!!!

ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా
చంద్రబాబు ప్రణాళిక సంఘానికి లేఖ రాయకపోవడం వల్ల రాలేదు
ప్రధాని - కేంద్రమంత్రి మండలి ఆమోదించిన విభజన చట్టం డబ్బులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మంత్రికి లేఖ రాయకపోవడం వల్ల రాలేదు.

చంద్ర బాబు, మీరు... ఇద్దరు కలిసి ఎంత పనిచేశారు జగన్ !! ఏపీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు.

గమనిక : ఇందులో ఎవరికైనా వ్యంగం కనిపిస్తే అది మా తప్పుకాదు. మా ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీచ్ విన్నాం కాబట్టి ఆ అవగాహనతో ఈ వార్త రాశాం. మేము రాసింది మీరు తప్పు పడితే మన ముఖ్యమంత్రిని తప్పు పట్టినట్లే. మీ ఇష్టం మరి !!