కేసీఆర్ లోపలి ఉద్యమ సింహం నిద్ర లేచిందా?

February 19, 2020

ఆదివారం అన్నంతనే ఆటవిడుగా అందరూ భావిస్తుంటారు. వారం మొత్తం రాజకీయంగా హాట్ హాట్ గా ఉన్నప్పటికి వారాంతంలోకి వచ్చేసరికి మాత్రం పొలిటికల్ మూడ్ మారిపోతుంటుంది. రాజకీయ కార్యక్రమాలుపెద్దగా ఉండవు. నేతలు సైతం ఆదివారం వీలైనంత వరకూ కుటుంబం.. ఇతరత్రా కార్యక్రమాలకు కాలాన్ని కేటాయిస్తారే కానీ.. ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేయటం లాంటివి ఉండవు.
విడి రోజులకు భిన్నంగా ఆదివారాలు.. సెలవు రోజులు.. పండుగ రోజుల్లో కీలకమైన రాజకీయ నిర్ణయాల్ని తీసుకునే ఇంట్రస్ట్ ను పార్టీలు ప్రదర్శించవు. అందుకు భిన్నంగా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ బాస్ వేసిన ఎత్తుగడలు ఆసక్తికరంగా ఉండేవి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విషయంలో ఎంత లోతుగా ఆలోచిస్తారో ఆయన సన్నిహితులు అప్పడప్పుడు ప్రస్తావిస్తుంటారు. ఎవరూ పట్టించుకోని అంశాల విషయంలోనూ ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయని చెబుతారు.
ఉద్యమ సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా భారీ కార్యక్రమాన్ని చేపడితే.. దాని ప్రయారిటీ తగ్గేలా కేసీఆర్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టటమో. కౌంటర్ సభల్ని నిర్వహించటమో.. లేదంటే ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టటం లాంటివి చేసేవారు. విషయాలు మీడియాలో ఫోకస్ అయ్యే సమయాన్ని.. సందర్భాన్ని లెక్క కట్టి మరీ కార్యక్రమాల్ని నిర్వహించేవారన్న పేరుంది.
తాజాగా అలాంటి ఎత్తుగడనే కొత్త గవర్నర్ తమిళిసై విషయంలోనూ వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంటే.. ఈ రోజు మొత్తం టీవీల్లో ఆమెకు సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు.. సోమవారం నాటి దినపత్రికల్లోనూ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రయారిటీ ఇవ్వటం ఖాయం. అయితే.. అలాంటి అవకాశం లేని పరిస్థితిని కేసీఆర్ తాజాగా కల్పించారని చెప్పాలి.
కేబినెట్ విస్తరణను చేపట్టటం.. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సావాన్ని చేపట్టటంతో.. కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారానికి మించిన ప్రాదాన్యత తమకు దక్కేలా కేసీఆర్ చేశారని చెప్పాలి. కొత్త మంత్రులు కేబినెట్ లోకి వచ్చిన నేపథ్యంలో.. ఆ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలకు మీడియా అధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి తొలిసారి గవర్నర్ గా మహిళ బాధ్యతలు చేపట్టారని.. బీసీ వర్గానికి చెందిన మహిళకు కేంద్రం పెద్దపీట వేసిందన్న ప్రచారానికి కేసీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టారని చెప్పాలి.
ఉద్యమ సమయంలో తనకు మించిన పొలిటికల్ మైలేజీ మరెవరికీ దక్కకూడదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. తాజాగా అదే తీరును ప్రదర్శిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినప్పటికీ.. తాజా తీరును చూస్తే.. కేసీఆర్ లోపలి ఉద్యమ సింహం నిద్ర లేచిందన్న భావన కలుగక మానదు. తన ఎంట్రీని గ్రాండ్ గా ఉండేలా చూసుకున్న తమిళిసైను చిన్నబుచ్చేలా కేబినెట్ విస్తరణను చేపట్టిన కేసీఆర్ నిర్ణయం రానున్న రోజుల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు ఆరంభంగా చెప్పక తప్పదు.