కేసీఆర్ ఎందుకు ఇంత మొండిగా ఉన్నారు?

April 04, 2020

ఆర్టీసీ విషయంలో కేసీఆర్ మొండికేస్తున్నారు. ఆర్టీసీ  ఉద్యోగులేమో... తెలంగాణ సాధన కోసమో జీవితాలు పణంగా పెట్టి ఉద్యమించాం. అంత చేసిన మాకు చిన్నచిన్న కోరికలు తీర్చలేరా? అని వారు నిలదీస్తున్నారు. ఆర్టీసీ విలీనం చేయమని అడగడం కేసీఆర్ కు సమస్య కాదు. కానీ ఏపీలో నిర్ణయం తన మీద ఒత్తిడి తేవడాన్ని అతను తట్టుకోలేకపోతున్నారు. జగన్ చేసిన పని వల్ల తాను తలొగ్గే పరిస్థితి రాకూడదు అన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే  ఇంత మొండిపట్టు పడుతున్నారు. ఇపుడు వెనక్కు తగ్గితే... ఏపీలో తీసుకునే ప్రతి నిర్ణయం తనను ఇబ్బంది పెడుతుందని కేసీఆర్ కు అర్థమైంది. అందుకే ఆర్టీసీ సమ్మెను అణచివేయడం వల్ల కలిగే ఇబ్బందులకు సిద్ధమయ్యారు గాని వెనక్కు తగ్గడానికి ఒప్పుకోవడం లేదు. అవసరమైతే నలుగురితో ఈ విషయంలో మాట పడటానికి కూడా కేసీఆర్ సిద్ధంగానే ఉన్నారు.

అయితే... కేసీఆర్ - ఆర్టీసీ మధ్య యుద్ధానికి హుజూర్ నగర్ ఫలితం ఆజ్యం పోసింది. ఒక వేళ ఆ ఫలితం భిన్నంగా ఉండి ఉంటే... ఉద్యమం ఈపాటికి రాజీతో ఆగిపోయేది. కానీ ఆ గెలుపుతో కేసీఆర్ మరింత మొండికేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ మీద ప్రజలు పూర్తిస్థాయిలో ఆధారపడి లేరు. చాలా కొద్ది రూట్లలో మాత్రమే ప్రజలు దీనిమీద ఆధారపడ్డారు. పట్టణాల్లో మెట్రో, క్యాబులు, ఆటోలు, బైక్ రైడ్ యాప్ లు ఇతర ప్రైవేటు వాహనాలు జనాల సమస్య తీరుస్తుంటే... పల్లెల్లో ప్యాసింజర్ ఆటోలు జనాల సమస్యను చాలా వరకు తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం అటు కేసీఆర్ వైపు గాని, ఇటు ఆర్టీసీ వైపు గాని లేరు. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఆర్టీసీ ఎలాగూ గవర్నమెంటుది అయినపుడే కలిపేయొచ్చుగా అన్నట్టే జనాభిప్రాయం ఉంది. ఎందుకంటే దాని నష్టాలు పూడ్చాల్సింది ప్రభుత్వమే. కాకపోతే ఈరోజు రేపు అంతే తేడా. ఆ మాత్రం దానికి వేరుగా ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి ? అన్నది జనాల భావన. విలీనం అనేది కార్మికుల వ్యక్తిగత సమస్యగా మాత్రమే జనాలు చూస్తున్నారు గాని దాని గురించి అంతకుమించి ప్రజలకు అవగాహన లేదు. అందుకే ఎవరి వైపు మొగ్గు చూపలేకపోతున్నారు. 

కేసీఆర్ మొండితనం ఎక్కడిదాకా వెళ్తుందో వేచిచూడాలి. ఎవరు వెనక్కు తగ్గుతారో కాలం గడిస్తే తెలుస్తుంది. వచ్చే నెల 5వ తేదీన అనేక విషయాలు బయటకు వస్తాయి. కేసీఆర్ పెట్టిన ఈ డెడ్ లైన్ కు కూడా ఉద్యోగులు జాబ్ లో చేరకపోతే...ఇక కేసీఆర్ కు కష్టమే. ఒకవేళ ఆరోజు పాతిక శాతం మంది ఉద్యోగాల్లో చేరినా... సమ్మె ఇక హుష్ కాకే.