సీక్రెట్- పోలవరం మీద కేసీఆర్ ప్రేమ అందుకేనా?

May 25, 2020

పోలవరానికి మేం వ్యతిరేకం కాదు. మేం ఆ ప్రాజెక్టుకు అడ్డం రాలేదు. తెలంగాణను ముంచుతామంటే మేం వద్దన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పోలవరం మీద అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాదు.. ఈ మధ్యనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం ప్రస్తావించని కేసీఆర్.. తమకు పోలవరం ప్రాజెక్టు మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పటం విశేషం.
తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయనలోని కొత్త ఎత్తుగడ రేఖా మాత్రంగా అర్థం కాక మానదు. పోలవరం మీద కేసీఆర్ తాజా సానుకూల వ్యాఖ్య వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయని చెప్పాలి. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కాకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరితే.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెఢీ చేసుకున్నారా? అన్న డౌట్ వచ్చేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని చెప్పాలి.
తాజాగా నిర్వహించిన సభలో పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించి కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యల్ని తీసుకుంటే..
‘‘పక్కోడు కూడా బాగుండాలని మేం కోరతాం. కానీ, మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేం కోరం. నీకున్నటువంటి దరిద్రపు బుద్ధి మాకు లేదు. నీలాంటి అల్పులం మేం కాదు. మేం బతకాలి.. ఇతరులు కూడా బతకాలని కోరతాం. ఇంకో మాట కూడా చెబుతున్నా. నీకు తెలివి లేదు. నాకు ఉంది. నాకు లెక్కలు తెలుసు. మాకు ఉదార స్వభావం ఉంది.
గోదావరిలో మాకు వెయ్యి టీఎంసీల కేటాయింపు ఉంది. దాన్ని బాజాప్త తీసుకుంటం. మీరు పోలవరం కట్టుకోవాలని చెప్పినం. మేం పోలవరానికి అడ్డం రాలేదు. తెలంగాణను ముంచుతమంటే వద్దన్నం. కానీ, పొలవరం కట్టడానికి సంపూర్ణ సహకారం అందిస్తాం
నీళ్లు వృథాగా పోతున్నాయి. తెలంగాణ, ఏపీ వాడుకున్న తర్వాత కూడా ఈ ఏడాది 2,600 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. అవి సముద్రంలో కలవడానికి బదులు ఏపీవాళ్లు వాడుకుంటే మాకేమీ అభ్యంతరం ఉండదు. మేం కోరేదల్లా మా వాటా మాకు రావాలని. మా పొలాలకు నీళ్లు రావాలని. మాతోపాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం’’ అంటూ కేసీఆర్ మాటల్ని ఎన్నిసార్లు చదివినా అందులో ఏం తేడా కనిపించదు. కానీ.. ఆయన మాటల్ని ఎక్కడికక్కడ అండర్ లైన్ పెట్టుకుంటే చదివితే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.
మూడో పేరాలో తెలంగాణ.. ఏపీ వాడుకున్న తర్వాత ఈ ఏడాది 2,600 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.. అవి సముద్రంలో కలవటానికి బదులు ఏపీ వాళ్లు వాడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదంటూ కేసీఆర్ చెప్పారే.. ఆ మాటను పెద్ద స్కెచ్ పెన్ తీసుకొని అండర్ లైన్ చేసుకొని ఒకటికి నాలుగుసార్లు చదవండి. అప్పుడు కానీ కేసీఆర్ మాటల్లో మర్మం ఇట్టే అర్థం కాక మానదు. సముద్రంలో కలిసే నీళ్లు ఆంధ్రా వాడుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని కేసీఆర్ నోటి నుంచి ఎందుకు వచ్చినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దిమ్మ తిరిగిపోయే కేసీఆర్ ఆలోచన ఏమిటో అర్థమవుతుంది.
ప్రాజెక్టులను తనకు తోచినట్లుగా రీడిజైన్ చేయటం అలవాటే. ఒకవేళ తాను కోరుకున్నట్లు జగన్ రెడ్డి కానీ ఏపీ ముఖ్యమంత్రి అయితే.. తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్లు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారుస్తామని చెప్పటమే. కాకుంటే.. ఏపీ ప్రయోజనాల పేరుతో ప్రాజెక్టు డిజైన్ మారుస్తామని ప్రచారం చేస్తారు. కేసీఆర్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేని వేళ.. అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. కానీ.. ఆంధ్రా ప్రయోజనాలకు దెబ్బ తగిలేలా.. తెలంగాణకు మేలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేశారన్న విషయాన్ని ఎవరూ నోరెత్తకుండా చేస్తారు.
ఒకవేళ ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే.. పక్కనున్నోడు పచ్చగా ఉందామని కోరుకోని దుర్మార్గం అంటూ సెంటిమెంట్ ను రాజేస్తారు. మొత్తంగా ఆంధ్రాకుహ్యాండిస్తూ.. తన తెలంగాణకు మేలు జరిగేలా ప్లాన్ చేసిన కేసీఆర్ తెలివితేటకు ఆంధ్రోళ్లు సలాం చేయాలి. ఎందుకంటే.. ఆంధ్రా ప్రయోజనాల కోసం మాత్రమే పోరాడే కేసీఆర్ లాంటోడు ఒకడు ఉండటం ఏపీకి అత్యవసరం. కాదంటారా?