ఒక్క ఎంపీ టార్గెట్‌గా రెండు మంత్రి ప‌ద‌వులు..!

January 22, 2020

' తెలంగాణ‌లో బీజేపీ ఎక్క‌డుంది.. అస‌లు ఆ పార్టీ గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు ' అని పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ, లోలోన మాత్రం టీఆర్ ఎస్ నేత‌లు బీజేపీని చూసి భ‌య‌ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండో సారి అధికారం ద‌క్కించుకున్న త‌ర్వాత ఇక రాష్ట్రంలో త‌మ‌కు ఎదురేలేద‌ని టీఆర్‌ఎస్ భావించింది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు పార్ల‌మెంట్ స్థానాల‌ను ద‌క్కించుకుని టీఆర్ ఎస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసింది.

అంతేగాక గులాబీ పార్టీకి కంచుకోట‌గా ఉన్న నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ లాంటి చోట్ల కూడా కాషాయ జెండాను ఎగుర‌వేసింది. టీఆర్ఎస్ అడ్డా అయిన ఉత్త‌ర తెలంగాణ‌లో ఏకంగా మూడు ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో ప‌డ్డాయ్‌. ఏకంగా ముఖ్య‌మంత్రి కూతురు క‌విత‌ను ఓడించి, గులాబీ పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. తాము ఊహించిన‌దానికంటే ఎక్కువ సీట్లు పొంద‌డంతో ఆ పార్టీ ఇక రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ‌లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా .. తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృ ష్టి సారించార‌ని ఆపార్టీ నేత‌లే ప్ర‌క‌టించారు.

అయితే తొలుత బీజేపీ నేత‌ల కామెంట్ల‌ను లైట్‌గా తీసుకున్న‌ట్టు కనిపించినా.. రానురాను టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీజేపీని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం బీజేపీ నేత‌ల ఎత్తుగ‌డ‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు స మాచారం. ఈ క్ర‌మంలోనే నిన్న జ‌రిగిన మంత్రివ‌ర్గ కూర్పులో కూడా ఆయ‌న ప‌లు జాగ్ర‌త్త‌లు తీ సుకున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ ఎస్‌కు గుండెకాయ‌లాంటి క‌రీంన‌గ‌ర్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టు కోల్పోవ‌ద్ద‌ని, ముఖ్యంగా పార్ల‌మెం ట్ స‌భ్యుడు బండి సంజ‌య్ దూకుడును అడ్డుకోవాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ ప‌రిధిలోని క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌తోపాటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇదే పార్ల‌మెంట్ ప‌రిధిలోని హుజురాబాద్ నుంచి టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత ఈట‌ల మంత్రివ‌ర్గంలో కొన‌సాగుతుండ‌గా, తాజాగా మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఎంపీ బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కరీంన‌గర్ ఓట‌రు ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్ర‌జ‌లు తేడా వ‌స్తే ఎవ‌రిని అయినా ఎక్క‌డ కూర్చోపెడ‌తారో ? అనేందుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది. టీఆర్ఎస్ కంచుకోట‌లోనే ఓ సామాన్యుడు సంచ‌ల‌న రీతిలో ఎంపీగా గెలిచాడు. అంతెందుకు అదే బండి సంజ‌య్ నాలుగు నెల‌ల క్రితం జ‌రిగిన ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో ఇదే గంగుల క‌మ‌లాక‌ర్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు అదే క‌మ‌లాక‌ర్‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక్క‌డ సంజ‌య్‌తో పాటు బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సంజ‌య్ క్రేజ్ పెరిగేందుకు, బీజేపీ ఎదిగేందుకు స్కోప్ ఇవ్వ‌కూడ‌ద‌నే కేసీఆర్ ఈ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. 

Read Also

ప్రయోగాల జోలికి వెళ్లని కేసీఆర్
హరీష్ పై కేసీఆర్ ప్లాన్ ఫ్లాపే... ఆ ఆరుగురు వీళ్లే ! 
బీజేపీ పుణ్యమా అని కేసీఆర్ తలొగ్గాడా?