అస్కార్ వేడుకల్లో దుమ్మురేపిన పారాసైట్ కథేంటి?

August 11, 2020

ప్రపంచ సినిమాకు తిరుగులేని పురస్కారంగా భావించే అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో దక్షిణకొరియాకు చెందిన పారాసైట్ మూవీ సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం నాలుగు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం.. ఉత్తమ దర్శకుడు.. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే.. ఉత్తర విదేశీ చిత్రం విభాగాల్లో అస్కార్లను సొంతం చేసుకుంది.
అస్కార్ పురస్కారాలకు ముందు ఈ చిత్రం కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందిన తొలి సౌత్ కొరియా చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఫారిన్ మూవీ అన్న పేరుతో పాటు.. బాఫ్టా అవార్డుల్లోనూ అవార్డును సొంతం చేసుకున్న ఇంగ్లీషేతర సినిమాగా రికార్డును క్రియేట్ చేసుకుంది.
ఇన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నిడివి 134 నిమిషాలు కాగా.. మన దేశంలో జనవరి 31న విడుదలైంది. 11 మిలియన్ డాలర్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మన రూపాయిల్లో చూస్తే.. 78 కోట్లు.  బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ వసూళ్లనే రాబట్టింది. దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.  అస్కార్ పురస్కారాల్లో అవార్డుల్ని భారీగా కొల్లగొట్టిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మరింత ఆదరణ లభించటం ఖాయం.
ఇంతకీ ఈ సినిమా కథేమిటన్న విషయంలోకి వెళితే.. ధనిక.. పేద కటుంబాల మధ్య అసమానతల కారణంగా సమాజంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెబుతుందీ డార్క్ మూవీ. ఒక పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కడుపు నింపుకోవటమే వారికి గగనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో తప్పుడు సర్టిఫికేట్లతో ఒక ధనిక కుటుంబంలో ఉద్యోగాల్లో చేరతారు. వీరి కంటే ముందు ఆ ఉద్యోగాల్ని చేస్తున్న వారిని మోసపూరితంగా ఇంట్లో నుంచి వెళ్లగొడతారు. తాము ఉద్యోగాల్లో చేరిన తర్వాత కూడా తామంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్లమన్న విషయాన్ని దాచి పెడతారు.
అదే సమయంలో యజమాని కుటుంబం విహారయాత్రకు వెళుతుంది.దీంతో.. వీరంతా ఇంట్లో సమస్త సౌకర్యాల్ని అనుభవిస్తూ దర్జాగా గడిపేస్తుంటారు. అయితే.. తాము ఒక కుటుంబం కారణంగా ఉద్యోగాలు కోల్పోయామన్న విషయాన్ని గుర్తించిన ఉద్యోగులు.. తమ యజమాని ఊరి నుంచి వస్తున్న విషయాన్ని తెలుసుకుంటారు.
అదే సమయంలో తాము మోసం చేసి ఉద్యోగాల్ని సంపాదించుకున్నామన్న విషయం యజమాని కుటుంబానికి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో వీరేం చేశారు? అన్నది మిగిలిన కథ. కాస్తంత వినోదంతో పాటు.. సమాజంలోని పరిస్థితుల్ని దర్శకుడు బాంగ్ జూన్ హో తెరకెక్కించారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ లోని కొన్ని మల్టీఫ్లెక్సుల్లో నడుస్తోంది ఈ చిత్రం.