కేసీఆర్ రాజైతే , మరి జగన్ సామంతరాజా ?

May 29, 2020

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ త‌న రాష్ట్రంలో మంత్రి వ‌ర్గ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే…పొరుగు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కోసం ప‌నిచేస్తున్నారా? ఇప్ప‌టికే ఏపీలో క్రియాశీలంగా ప‌ర్య‌టిస్తున్న త‌ల‌సాని ఇప్పుడు హైద‌రాబాద్ కేంద్రంగానే ఈ రాజ‌కీయాల‌ను కొన‌సాగిస్తున్నారా? తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప‌రిణామంతో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా హైద‌రాబాద్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కలవ‌డంతో ఈ మేర‌కు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, ఇటీవలి కాలంలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌ని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాజాగా అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. హైద‌రాబాద్‌లోని మంత్రి తలసాని ఇంటికి వెళ్లి సమావేశమ‌య్యారు. ఏపీ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు స‌మాచారం. దాదాపు గంట పాటు ఈ స‌మావేశం జ‌రిగింది. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఇటీవ‌లే వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీ ముందు త్రిమూర్తులును కలిసిన సంగ‌తి తెలిసిందే. గ‌త స‌మావేశాల‌ నేప‌థ్యంలో తాజా భేటీ ఆస‌క్తిని సంత‌రించుకుంది.

ఇదిలాఉండ‌గా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ…తెలుగు రాష్ట్రాలకు తాను రాజుగా ఉంటూ…జగన్‌ను ఏపీకి సామంతరాజుగా నియమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ గెలిస్తే తన ఆటలు సాగవనే జగన్‌కు టీఆర్‌ఎస్‌ సహకరిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులన్న వారిని కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. వారిని వైసీపీలోకి పంపిస్తున్నారని బాబు ఆరోపించారు.