మన కేసీఆర్ సార్ చానా ఫీలైఫోయారు... పాపం

August 07, 2020

మనిషి మెదడు పలు సూపర్ కంప్యూటర్లకు మించి అని చెబుతారు కానీ.. మెమరీ విషయంలోనూ లెక్క తేడా కొడుతుంటుంది. కొన్ని విషయాల్ని అమితంగా గుర్తుంచుకునే ప్రజలు.. కొన్ని విషయాల్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి తీరే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారికి వరంగా మారుతుంటాయి.

గడిచిన కొద్దిరోజులుగా అదే పనిగా సీఎం కేసీఆర్ ఎక్కడ? ఎక్కడ? అంటూ ఉద్యమస్ఫూర్తితో హడావుడి చేసినా లైట్ తీసుకోవటం తెలిసిందే. రెండు రోజుల క్రితం మాజీ సర్పంచ్ కమ్ రైతు నేతతో మాట్లాడినట్లుగా ఒక ప్రెస్ నోట్ రావటం.. దానికి ప్రాధాన్యత ఇస్తూ మీడియాలో ప్రసాదం లెక్కన వాడిన వైనం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (శుక్రవారం) ఉదయం పదకొండు గంటల సమయంలో సీఎంవో నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. సాధారణంగా సాయంత్రాలో.. రాత్రిళ్లో.. లేదంటే కాస్త పొద్దుపోయిన తర్వాత పంపించే చాలా నోట్లకు భిన్నంగా పొద్దుపొద్దున్నే పంపిన ప్రెస్ నోట్ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సచివాలయంలో పాత భవనాల్ని కూల్చివేసే సందర్భంలో అక్కడున్న దేవాలయాన్ని.. మసీదుకు కొంత ఇబ్బంది కలగటం పట్ల సీఎం కేసీఆర్ తన భాధను.. విచారాన్ని సదరు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

ఈ బాధ.. వేదన చాలామంది జర్నలిస్టులకు ఆశ్చర్యాన్ని.. విస్మయానికి గురి చేశాయి. ఎందుకంటే.. రెండు రోజుల క్రితం సీఎంవో విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. సచివాలయంలో కూల్చివేతలు స్టార్ట్ కావటానికి కాస్త ముందుగా దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి.. గుడిని తొలగించారని పేర్కొన్నారు.

అంతేకాదు.. అక్కడే ఉన్న మసీదును తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొందరు మత పెద్దల్ని పిలిపించి.. వారికి విషయాన్ని వెల్లడించటమే కాదు.. మసీదులోని కొన్ని గ్రంధాల్ని వారికి అప్పజెప్పినట్లుగా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఇదే విషయం పలు మీడియా సంస్థల్లోనూ అచ్చు అయ్యింది.

ఇదిలా ఉంటే.. తీరిగ్గా రెండు రోజుల తర్వాత గుడి.. మసీదుకు సంబంధించి సీఎంగారి బాధను.. ఆవేదనను ప్రెస్ నోట్ లో తెలీయజేయటంపై కేసీఆర్ సున్నితమైన ఆయన మనసును వేనోళ్ల కొనియాడుతున్న పరిస్థితి. ఆయన ఎంత సున్నితమైన వ్యక్తి కాకుంటే.. రెండు రోజుల తర్వాత స్పందిస్తారన్నది ప్రశ్న. అంతేనా.. ఆ ప్రెస్ నోట్ మొత్తం చదివితే కేసీఆర్ తీరుకు షాకుల మీద షాకులు తగలాల్సిందే.

ఇప్పుడున్న ప్రాంతంలో గుడిని.. మసీదును మరింత గొప్పగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికంటే పెద్దవిగా నిర్మిస్తామన్న హామీని ఇచ్చారు. ఎత్తైన భవనాలు కూల్చివేత సందర్భంలో కొన్ని శిథిలాలు.. పెచ్చులు దేవాలయం మీద పడిపోవటంతో.. వాటికి కొద్ది ఇబ్బంది కలిగిందని.. ఆ విషయం తనకుతెలిసి చాలా బాధ కలిగినట్లుగా పేర్కొన్నారు.

ఊరికి దూరంగా అక్కడెక్కడో ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్.. సచివాలయంలోని గుడి.. మసీదు లకు జరిగిన ఇబ్బందికి ఆయన విలవిలలాడిపోయినట్లుగా ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మసీదు.. దేవాలయాల్ని చెడగొట్టటం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని.. సచివాలయ ప్రాంతంలోనే కొత్తగా దేవాలయం.. మసీదులను ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తానని పేర్కొన్నారు.

అంతా బాగుంది కానీ.. ఒక్కటే సందేహం. శివుడి అనుమతి లేనిదే.. చీమ కూడా కదలదంటారు? సచివాలయ కూల్చివేతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్ర డీజీపీ చెరోవైపు ఉండి.. దగ్గరుండి అన్ని పనులు తామై నిర్వర్తించారు. అలాంటప్పుడు గుడి.. మసీదుకు సంబంధించిన వివరాలు ముందే తెలీకుండా ఉంటాయా? అన్నది ప్రాథమిక ప్రశ్న. అనవసరమైన వాటి గురించి మనసులో ప్రశ్నలు వేసుకునే కన్నా.. మౌనంగా ఉండటానికి మించింది మరొకటి ఉండదన్నది మర్చిపోకూడదు.