ప్రియాంక ఎంట్రీ వెనుక చంద్రబాబు ప్లాన్ ఉందా..?

May 26, 2020

లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడుత పూర్తయింది. ఇంకా ఆరు విడుతల ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీలు స్పీడు పెంచేశాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే భావనలో ఉన్న ఆ పార్టీ.. అందుకోసం ప్రాంతీయ పార్టీల సాయం కూడా తీసుకుంటోంది. అలాగే కొద్దిరోజుల క్రితం తన అమ్ములపొదలోని కీలక అస్త్రాన్ని సంధించింది. ఎన్నాళ్లుగానో పార్టీ శ్రేణులు కోరుతున్నట్టుగా రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీకి ఆ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె దూసుకుపోతున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా పని చేస్తున్నారు.

ప్రియాంకను తెరపైకి తీసుకు రావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. ఆ పార్టీ శ్రేణులు కూడా ప్రియాంక రాకను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. అయితే, ఆమె ఎంటరైన సమయంలో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆమెను పార్టీలోకి తీసుకు రావడం వెనుక భారీ వ్యూహమే దాగున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ సారి యూపీ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రియాంకకు అప్పగించిందని ప్రచారం జరిగింది. నిజానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి.. యూపీలో ప్రతిపక్షాలను కట్టడి చేయగల బలమైన నేతగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను ఎంచుకొందనేది అందరికీ తెలిసిందే.

దేశం మొత్తం హాట్ టాపిక్‌గా నిలిచిన ప్రియాంక గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ఇంకా బలమైన నేతలు కావాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ప్రియాంకను దించాలని రాహుల్‌కు సూచించారట. ఇప్పుడీ వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ నియోజకవర్గంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని దింపాలని చంద్రబాబు.. రాహుల్‌కు సలహా ఇచ్చినట్లు రిపబ్లిక్‌ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో పైన పేర్కొన్న విషయాన్ని బలం చేకూరినట్లైంది. ఏది ఏమైనా ఈ పరిణామంతో చంద్రబాబు బలం ఏంటో మరోసారి బయటపడింది.