కొత్త రూమ‌ర్.. బిగ్ బాస్ హోస్ట్‌గా సూప‌ర్ స్టార్

August 04, 2020

హిందీ బిగ్ బాస్ షోను చాలా ఏళ్లుగా స‌ల్మాన్ ఖానే న‌డిపిస్తున్నాడు. త‌మిళ బిగ్ బాస్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి మూడు సీజ‌న్ల పాటు క‌మ‌ల్ హాస‌నే హోస్ట్‌గా ఉన్నాడు. కానీ తెలుగులో మాత్రం ఒక్కో సీజ‌న్‌కు ఒక్కో హోస్ట్‌ను చూస్తున్నాం. అరంగేట్ర సీజ‌న్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. త‌ర్వాతి సీజ‌న్‌కు అత‌ను అందుబాటులో లేకుండా పోవ‌డంతో నానిని తీసుకొచ్చారు. ఆ త‌ర్వాతి సీజ‌న్‌కు అత‌ను దండం పెట్టేయ‌డంతో నాగార్జున లైన్లోకొచ్చాడు. నాలుగో సీజ‌న్‌కు నాగ్ హోస్ట్‌గా కొన‌సాగే అవ‌కాశం లేన‌ట్లే ఉంది. ఆయ‌న‌కు షో అనుభ‌వం అంత‌గా న‌చ్చ‌లేదంటున్నారు. నాగ్ హోస్టింగ్ స్కిల్స్ మీద కూడా మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది. దీంతో త‌ర్వాతి సీజ‌న్‌కు హోస్ట్ మార్పు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.
మ‌రి నాలుగో సీజ‌న్లో హోస్ట్‌గా ఎవ‌రుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. దీనిపై ఇప్పట్నుంచో స‌స్పెన్స్ న‌డుస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నం ఫ‌లించేలా లేదు. అత‌ను షో మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఖాళీగా ఉండ‌డ‌ట‌. ఆర్ఆర్ఆర్ నుంచి అప్ప‌టికి కూడా బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం లేద‌ట‌. అది పూర్త‌యినా త్రివిక్ర‌మ్‌తో త‌ర్వాతి సినిమాకు పెద్ద‌గా గ్యాప్ ఉండ‌ద‌ట‌. ఇక ఇంత‌కుముందు అనుకున్న వెంక‌టేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా హోస్ట్ స్థానంలోకి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువే అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును స్టార్ మా వాళ్లు ట్రై చేస్తున్నార‌ని.. అత‌నొస్తే షో స్థాయి పెరుగుతుంద‌ని.. కాబ‌ట్టి భారీ పారితోష‌కం ఇచ్చి అత‌ణ్ని షోలోకి తీసుకురావాల‌ని చూస్తున్నార‌ని ఒక ప్ర‌చారం మొద‌లైంది. షో ఆరంభానికి కొన్ని నెల‌లుండ‌గా వ‌చ్చిన ఈ రూమ‌ర్ ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి మ‌రి.