కోడెల కొడుకునీ వదలం !!

August 11, 2020

కోడెల మృతి ఒక రాజకీయ సంచలనం. ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలకు, తెలుగు ప్రజలకు సుపరిచితుడు అయిన కోడెల జీవితం ఆత్మహత్యతో ముగియడం అందరినీ కలచివేసింది. పల్నాటి పులి అని పేరొందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే... వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.ఇదిలా ఉంటే... కోడలె మరణంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో ఎవరి పాత్ర అయినా ఉందా అనే విషయంపై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే చాలామందిని విచారించారు.
తాజాగా దర్యాప్తు గురించి బంజారాహిల్స్‌ ఏసీపీ కే.శ్రీనివాసరావు మాట్లాడారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించినట్లు వెల్లడించారు. కోడెల కుంటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. కోడెల భౌతిక కాయానికి సంబంధించి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇంకా అందలేదని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. మిస్సయిన కోడెల ఫోన్‌లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నారట. సీడీఆర్‌ఏ కాల్‌ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియాలో కోడెల కాల్‌ డేటాపై వస్తున్న వార్తలు పట్టించుకోవద్దన్నారు.

కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. శివరామ్ ను విచారించడంలో ఇబ్బందేం లేదు గాని... అంత్యక్రియలు ముగిశాక ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తే బాగుంటుంది. ఇపుడు అంత్యక్రియల సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్లు ఎందుకు ఇస్తున్నట్టు? ఎవరికోసం ఎవరిని టార్గెట్ చేసినట్టు. ?