తెలంగాణ మందుబాబుల‌దే రికార్డ్

May 25, 2020

అనుకున్న‌దే అయింది. తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాలు పునఃప్రారంభ‌మైన తొలి రోజు మ‌ద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జ‌రిగాయి. బుధ‌వారం ఒక్క రోజే రూ.90 కోట్ల మేర మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం విశేషం. లాక్ డౌన్ ష‌ర‌తులు స‌డ‌లించాక దేశంలో ఒక్క రోజులో అత్యధికంగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన రాష్ట్రం తెలంగాణే అని అంటున్నారు. చాలా రాష్ట్రాల్లో సోమ‌వార‌మే మ‌ద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.

ఏపీలో తొలి రోజు రూ.60 కోట్ల మేర మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. దానికే ఔరా అనుకున్నారు. క‌ర్ణాట‌క‌లో కూడా తొలి రోజు ఇదే స్థాయిలో అమ్మ‌కాలు జ‌రిగాయి. ఐతే తెలంగాణ‌లో, ముఖ్యంగా హైద‌రాబాద్‌లో మందుబాబుల జోరెలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కాబ‌ట్టి మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరిస్తే ఇక్క‌డ రికార్డు స్థాయిలోనే అమ్మ‌కాలు ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.
ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఏకంగా తొలి రోజే రూ.90 కోట్లకు మద్యం కొన్నారు ఇక్క‌డి జ‌నాలు. ఏపీలో తొలి రోజు 25 శాతం మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌గా.. తెలంగాణ‌లో 11 నుంచి 15 శాత‌మే ధ‌ర‌లు పెంచారు. ఏపీతో పోలిస్తే ఇక్క‌డ షాపుల సంఖ్య త‌క్కువే అంటున్నారు. అయినా స‌రే.. ఇక్క‌డ రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు జ‌రిగాయి. ఏపీ అనుభ‌వాల దృష్ట్యా ఇక్క‌డ మ‌ద్యం దుకాణాల ద‌గ్గ‌ర ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌కుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లే చేశారు.

ఎక్క‌డా జనాలు ఒక‌రిపై ఒక‌రు ప‌డి తోసుకున్న ఉదంతాలు క‌నిపించ‌లేదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధ‌రిస్తూ మందుబాబులు ప‌ద్ధ‌తిగా క్యూలో నిలబ‌డ్డారు. ఎక్క‌డైనా నిబంధ‌న‌లు పాటించ‌కుంటే గంట వ్య‌వ‌ధిలో వైన్ షాపులు మూత‌ప‌డ‌తాయ‌న్న కేసీఆర్ హెచ్చ‌రిక బాగానే ప‌ని చేసింది. ఈ నెలంతా ఇలాగే అమ్మ‌కాలు సాగితే.. తెలంగాణకు భారీగా ఆదాయం స‌మ‌కూరే అవ‌కాశ‌ముంది.