‘బిగ్ బాస్’గా విజయ్ మాల్యా

July 12, 2020

ఇద్దరూ ఇద్దరే.. జల్సా రాయుళ్లే.. ఆ ఇద్దరూ కలిపి ఫొటో దిగితే ఎలా ఉంటుంది. కానీ, నెటిజన్లు మాత్రం వారిద్దరూ కలిసి ఫొటో దిగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తెగ ట్రోలింగ్ చేశారు. అవును... బ్యాంకులకు రూ. 9వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, క్రికెటర్ క్రిస్ గేల్ కలిసి ఒకే ఫొటోలో కనిపించడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.
ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌కి వెళ్లిన మాల్యా..వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌తో ఫొటో దిగాడు. ఈ ఫొటోను గేల్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ విజయ్‌ మాల్యాతో ఫొటో దిగడం గొప్పగా ఉందని క్యాప్షన్‌ ఇచ్చి దాన్ని షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు గేల్‌ను ట్రోల్‌ చేశారు. బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి తిరిగేవాడిని బిగ్‌బాస్‌ అంటారేంటి అని నెటిజన్లు గేల్‌మీద కామెంట్లు చేశారు. గేల్‌కి కూడా మాల్యా గొప్పగా కనిపిస్తున్నారంటూ మీమ్‌లు కూడా తయారు చేసి పెట్టేశారు.
అయితే వీటిపై మాల్యా స్పందించాడు. నెటిజన్లను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశాడు. ‘ నా స్నేహితుడు, యూనివర్సల్‌ బాస్‌తో ఫొటో దిగడం గొప్పగా ఉంది. నన్ను చోర్‌ అని పిలుస్తున్న వారందరికీ నేనో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదిగా నేను నా రుణం 100శాతం తీర్చేస్తానని చెబుతున్నా. వాటిని తీసుకోవాలని మీ బ్యాంకులకి చెప్పండి. ఎవరు దొంగో అప్పుడు నిర్ణయించండి’ అని ట్వీట్ చేశాడు.