బాబును తిట్టి...అదే ప‌ని చేస్తోన్న జ‌గ‌న్‌

August 02, 2020

``రాష్ట్రంలోని మహిళలందరి భద్రతకు నాది భరోసా.. అంటూ నమ్మబలికి 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆ తర్వాత కూడా మహిళలు, బాలికల భద్రతపై అనేక వేదికలపై, సభల్లో చంద్రబాబు ఉపన్యాసాలు దంచేశారు. కానీ ఆయ‌న పాల‌న‌లో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేదు. కనీసం పట్టపగలైనా ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వచ్చే పరిస్థితి లేదు` ఇది ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌లు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ ఏలుబ‌డిలో ఏం జ‌రుగుతుందో తెలుసా? స‌రిగ్గా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు ఆయ‌న‌కే వ‌ర్తించే ప‌రిస్థితి.

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో తొలి రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఉండ‌గా...ముచ్చ‌ట‌గా మూడో స్థానం వైసీపీ సొంతం చేసుకుంది. మహిళలపై దాడులు, హింస కేసుల్లో వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఇది రాజ‌కీయ‌ ఆరోప‌ణ కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేల ధ్రువీకరణల ఆధారంగా ప్రజాస్వామిక సంస్కరణల సమాఖ్య(ఏడీఆర్‌) వెలువరించిన నివేదికలో స్పష్టమైన అంశం. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, న‌లుగురు ఎమ్మెల్యేలు మ‌హిళ‌ల వేధింపుల విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న‌ట్లు వారే పేర్కొంటున్నారు. ఓవైపు మహిళకు రక్షణగా నిలవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అబలలపై దాడులు, వేధింపులు, దౌర్జన్యాలకు దిగుతుంటే... అదే స‌మ‌యంలో ఆ పార్టీ అసెంబ్లీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ గురించి గొంతు చించుకోవ‌డం, తామే కాపాడే వాళ్ల‌మ‌ని ప్ర‌క‌టించుకోవ‌డం చిత్రంగా ఉందంటున్నారు.

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో ఆందోళ‌నక‌ర అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. లోక్‌సభలో 2009 నాటికి ఈ కేసుల్లో ఉన్న ఎంపీలు ఇద్దరే ఉండగా, పదేళ్లు గడిచేసరికి వారి సంఖ్య 19కు చేరుకోవ‌డం చ‌ట్ట‌స‌భ‌లోని నేత‌ల‌పై విష‌యంలో సామాన్యుడు విస్మ‌యానికి గుర‌య్యే ప‌రిస్థితిని క‌ల్పిస్తోంది. ఇత‌క‌ లోక్‌సభకు పోటీచేసిన అభ్యర్థుల్లో మహిళలపై దాడుల కేసులు ఉన్నవారి సంఖ్య 36నుంచి 126మందికి, అంటే ఏకంగా 231శాతం పెరిగిన‌ట్లు ఏడీఆర్ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. వివిధ పార్టీల‌కు చెందిన‌ ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు అత్యాచారాల కేసులు తమపై ఉన్నట్టు ఈసీ వద్ద ధ్రువీకరించడం గ‌మ‌నార్హం.