ఉబెర్ డ్రైవర్ నిద్రిస్తుంటే కస్టమర్ కారు నడిపింది

August 10, 2020

ఉబెర్ కారు డ్రైవర్ కునుకుతీస్తుంటే 28 ఏళ్ల మహిళ కారు నడిపిన సంఘటన గత నెల (ఫిబ్రవరి 21)న చోటు చేసుకుంది. తేజస్వి దివ్య పుణే నుండి ముంబైలోని అంధేరీలో ఉండే తన ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. అయితే డ్రైవర్ కునికిపాట్లు పడుతుండటం గమనించి.. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో కారు స్టీరింగ్‌ను తన చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆమె కారు నడుపుతుంటే ఉబెర్ డ్రైవర్ హాయిగా నిద్రపోయాడు.

ఆమె ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 1 గంటల సమయంలో క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఉబెర్ డ్రైవర్ కారులో నిద్రపోతుంటే తాను డ్రైవింగ్ చేసిన సంఘటనకు సంబంధించిన అంశాన్ని తేజస్వి దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఫిలిం ఇండస్ట్రీలో పని చేస్తున్నారు.

సదరు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే తొలుత పదేపదే ఫోన్లో మాట్లాడాడని, కానీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడవద్దని తాను సూచించానని, దీంతో అతను తన ఫోన్ పక్కన పడేశాడని ఆమె పేర్కొంది. అయితే ఆ తర్వాత అతను కునికిపాట్లు పడటం తాను గుర్తించానని పేర్కొన్నారు. ఓ సమయంలో డ్రైవర్ ఓ కారును, అలాగే డివైడర్‌ను ఢీకొట్టబోయాడని పేర్కొన్నారు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె తాను కాసేపు కారు నడుపుతానని, పడుకోమని చెప్పారు.

దీంతో అతను కారు స్టీరింగ్ తన చేతికి ఇచ్చాడని తెలిపారు. అయితే తాను కేవలం అరగంట మాత్రమే కారు నడుపుతానని, తనకు బ్యాక్ ప్రాబ్లం కారణంగా ఎక్కువ దూరం నడపలేనని కూడా అతనికి చెప్పానని వెల్లడించారు. తనకు కారు స్టీరింగ్ ఇచ్చిన డ్రైవర్.. నిద్రపోవడానికి బదులు పదేపదే ఫోన్లో మాట్లాడటం, తన డ్రైవింగ్ స్కిల్స్‌ను మెచ్చుకోవడం చేశాడన్నారు.

ఆ తర్వాత చాలాసేపటికి అతను నిద్రపోయాడు. దీంతో ఆమె అతని నిద్రపోతున్నప్పటి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. ఈ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసి క్యాబ్ కంపెనీకి ట్యాగ్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన ఉబెర్.. ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, డ్రైవర్‌ను విధుల నుంచి తొలగిస్తామని తెలిపింది. తేజస్వి దివ్య దాదాపు 150 కిలో మీటర్లు కారు నడిపారు.