మగువ గురించి రాసిన ఒక మాస్టర్ పీస్

August 12, 2020

ఆర్టికల్ కొంచెం పెద్దది... కానీ పూర్తిగా చదివాక మీ హృదయం ఉప్పొంగడం మాత్రం గ్యారంటీ !!

 

వినా స్త్రీయా జననం నాస్తి
వినా స్త్రీయా గమనం నాస్తి
వినా స్త్రీయా జీవం నాస్తి
వినా స్త్రీయా సృష్టియేవ నాస్తి

స్త్రీ లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే గమనం లేదు
స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు
స్త్రీ లేకపోతే సృష్టే లేదు

అని గొప్పగా చెప్పుకుంటాం..!

కానీ నేటి సమాజంలో చెప్పుకోవడానికి ఆడవారి గొప్పదనం ఎంతుందో ఆడవారి పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అన్ని ఉన్నాయి..

అమ్మ కడుపులో నుంచే పుడతాం,
అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలే వింటాం,
అక్క చెల్లెల్లు జతగా పెరుగుతాం,
మరదళ్ళని ప్రేమిస్తాం, ఆటపట్టిస్తాం,
భార్యతో జీవితం పంచుకుంటాం,
కూతురుని ప్రేమగా పెంచుకుంటాం..!

పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆడవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది..!

కానీ వీళ్ళేవరు కాకుండా వేరే అమ్మాయిని మాత్రం
తక్కువ చేసి మాట్లాడతాం,
చులకనగా చూస్తాం,
తప్పుగా ఆలోచిస్తాం..!

కానీ తప్పు ఎక్కడ ఉంది,
ఎవరిలో ఉంది అని ఆలోచించం,
ఎవరైనా అడిగితే మౌనం వహిస్తాం,
లేదంటే ఆ తప్పుని కూడా ఆడవారి మీదకే తోసేస్తాం..!

కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన నేటి సమాజంలోని మొదటి తప్పు తల్లిదండ్రుల పంపకం లోనే ఉంది..!

ఎందుకంటే అమ్మాయి పుట్టి కాస్త పెరిగి పెద్దయిన నుంచి అబ్బాయిలతో మాట్లాడకు, అబ్బాయిలతో ఆటలాడకు, అని చెప్పడమే తల్లిదండ్రులు చేస్తున్న అతి పెద్ద తప్పు..!

కానీ అదే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు కూడా తమ కొడుకుకి అమ్మాయిలతో జాగ్రత్తగా నడుచుకో, అమ్మాయిలని గౌరవించు అని చెప్పడం లేరు ఎందుకు..?

ఇక ఇప్పుడు పాఠశాలల్లో ఏకంగా అబ్బాయిలు ఒక్క క్లాసు, అమ్మాయిలు ఇంకో క్లాసులో ఉంచి మరి పాఠాలు చెబుతున్నారు..!

పిల్లలు పెరిగే వయసులో,
మంచి చెడులు తెలుసుకునే వయసులో,
మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు గురువులది..!

కానీ వారెవ్వరూ కూడా పిల్లలకి ఎవరు ఎవరితో ఎలా నడుచుకోవాలి అని చెప్పడం లేరు అందరికి మార్కులు, ర్యాంకులు మాత్రమే కావాలి కాబోలు అందుకే వాటిని మాత్రమే గుచ్చి గుచ్చి చెబుతున్నారు..!

ఇలా వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉంచి ఉంచి వారికే తెలియకుండా వారిలో ఎవరితో అయిన మాట్లాడాలి అనే ఆసక్తి రేకెత్తిస్తున్నారు..!

ఎందుకంటే అబ్బాయిలతో మాట్లాడకండి అని చెబుతున్నారు కానీ ఎందుకు మాట్లాడకూడదు అని మాత్రం చెప్పడం లేరు, పిల్లలకి చెప్పిన అర్థం చేసుకునే వయసు లేదు అని అని తల్లిదండ్రుల్లో ఉన్న భయం.!

చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో మాట్లాడొద్దు మాట్లాడొద్దు అని అమ్మాయిలని రీస్ట్రిక్ట్ చేసి చేసి 17-20 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ & గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వేరే ప్రాంతాలకు పిల్లల్ని పంపిస్తున్నారు..!

ఆ వయసులో కలిగే ఆలోచనల వల్ల, కోరికల వల్ల ఇట్టే అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షితులు అవుతున్నారు..!

దాన్నే ప్రేమ అనుకుని చేయకూడనివి చేస్తున్నారు, ఇన్నేళ్లుగా తల్లిదండ్రులు బయపడ్డది నిజం అవుతుంది, తెలిసితెలియక చేసిన తప్పుల వల్ల వారి జీవితం కూడా నాశనం అవుతుంది, ఆడపిల్లల పైన జరిగే ఎన్నో అఘాయిత్యాలకి కారణం అవుతుంది..!

దీని వల్లే ఎంతో పవిత్రమైన ప్రేమకి కూడా అర్థం మారిపోయింది నేటి సమాజంలో..!

రోజురోజుకీ మనం అభివృద్ధి చెందుతున్న నాగరికతలోకి వెళుతున్నాం, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదవాల్సిన, ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి..

కాబట్టి పిల్లలకి మాట్లాడొద్దు మాట్లాడొద్దు అని చెప్పడం కాకుండా ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియజేయండి..!

ఇద్దరు అమ్మాయిలు మధ్య స్నేహం
ఇద్దరు అబ్బాయిల మధ్య స్నేహం ఎంత బలంగా ఉంటుందో,
ఒక అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహం కూడా అంతే బలంగా మరియు ఎంతో అందగా ఉంటుంది..!

నేటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి చోట కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో స్నేహితురాలు ఉంటే తల్లిగా, చెల్లిగా నడుచుకుంటుంది, అలాగే స్నేహితుడు ఒక అన్నగా కాపాడుకుంటాడు..!

అనవసరంగా భయపడి తరువాత బాధ పడడం కన్నా ముందు నుంచే రాబోయే పరిస్థితులకు అలవాటు పడేలా పిల్లల్ని సిద్ధం చేయండి మంచిది..!

అబ్బాయిలు కూడా తల్లితో చెల్లితో నడుచుకున్నట్టే మన స్నేహితురాళ్ళతో కూడా నడుచుకోవాలి..!

అమ్మాయిలని ఎంత ఆటపట్టించినా ఎంత వరకు ఆటపట్టించాలో తెలిసి ఉండాలి, తెలుసుకుని నడుచుకోవాలి..!

పైగా ఇప్పుడున్న సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడితే కూడా ఏదేదో ఊహించుకుని ఎగతాళి చేసే పరిస్థితులు ఉన్నాయి..!

మనలో ఆలోచన విధానం మారితేనే చాలా వరకు ఆడవారి మీద అత్యాచారాలు తగ్గుతాయి..!

ఇక మనం అందరం పీవీ సింధు, సైనా నెహ్వాల్, మిథాలి రాజ్ క్రీడల్లో రాణించి కప్పులు సాధిస్తే ఎంతో గర్వపడి వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ పోస్టులు పెడతాం కానీ మన ఇంటి అడపిల్లలని మాత్రం ఆటలు ఆడటానికి ప్రోత్సహించం..!

కాబట్టి ఆడవారు ఎందులోను మగవారికి తీసిపోరు అని మాటలకే పరిమితం కాకుండా వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించుదాం..!

దయచేసి ఆడవారిని మనం అందరం గౌరవించుకుందాం, ఎందుకంటే వారు లేకపోతే నిజంగా ఈ సృష్టి ఆగిపోతుంది..

ఎక్కడి వరకో ఎందుకు మన ఇంట్లో మన అమ్మ గురించి తెలుసుకుంటే చాలు ఆడవారిని ఎందుకు గౌరవించాలో అర్థం అవుతుంది..

ఇంట్లో అమ్మ
అందరికంటే ముందే నిద్ర లేస్తుంది,
ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది,
దేవుడికి పూజ చేస్తుంది,
మనం లేవగానే టీ కాఫీలు పెడుతుంది,
అందరికి టిఫిన్ చేస్తుంది,
మధ్యాహ్ననానికి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది,
పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్ళగానే,
వండిన, తిని పడేసిన సామాన్లు కడుగుతుంది,
బట్టలు ఉతికేస్తుంది,
మళ్ళీ మనం సాయంత్రం రాగానే
టీలు, కాఫీలు, స్నాక్స్ చేసి పెడుతుంది,
మళ్ళీ వంట చేస్తుంది,
అందరం తిన్నాక తింటుంది
మళ్ళీ అన్ని కడిగేసి అందరం పడుకున్నాక పడుకుంటుంది,
మళ్ళీ తెల్లరకముందే మన అందరికంటే ముందు లేస్తుంది..!

ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే, రోజు చూసే విషయాలే కానీ అమ్మ చేసే పనులు చెయ్యడం మాత్రం చూసి వదిలేసినంత తేలిక కాదు..!

అంత ఎందుకు మనలో ఎంతో మంది హాస్టల్లో వారానికి ఒక్కరోజు కేవలం మన బట్టలు ఉతుక్కుంటే ఇంట్లో అమ్మ రోజు అందరి బట్టలు ఎలా ఉతుకుతుంది అని అశ్చ్యర్యపోతాం..!

అమ్మ నిజంగా గ్రేట్ అనుకుంటాం..!

ఒక్క రోజు కాస్త పని ఎక్కువై అలసిపోతే మగవాళ్ళం ఇంటికి వచ్చి పడుకుంటాం కానీ ఆడవారు అలసిన, ఆరోగ్యం బాగోకపోయిన ఏది ఏమైనా ఎంత పని అయిన వాళ్ళే చేసుకుంటారు..!

అంతెందుకు ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగోలేకపోయినా తాను లేచి టీ, టిఫిన్లు పెట్టిస్తే కానీ టీ తాగని టిఫిన్లు తినని ఇల్లు ఎన్నో ఉన్నాయి..!

 

ఆడవారు చేసే శ్రమ కనబడదు కానీ వారే లేకపోతే ఈ సృష్టిలో మానవ మనుగడే కనబడదు..

ఏ ఒక్క మగాడు కూడా ఇంట్లో అమ్మ భార్య చేసే పనులన్నీ ఒకే రోజు చెయ్యలేడు, ఒకవేళ అందులో సగం చేసిన ఆ కష్టం తెలిసి అమ్మకి, భార్యకి దండం పెట్టకుండా ఉండలేడు..!

కాబట్టి ఇంట్లోని పనుల్లో కూడా ఆడవారికి సహాయపడదాం..!

ఆడవారితో పోలిస్తే
మగవాడిగా బ్రతకడం చాలా తేలిక..!

కేవలం మహిళల పైన అత్యాచారాలు జరిగినప్పుడు అయ్యో అనడం కాకుండా, తోటి మహిళని తక్కువ చేసి మాట్లాడకుండా, గౌరవించి నడుచుకుంటూ ముందుకు సాగితే ఈ సమాజం, మన గమనం చాలా సాఫీగా సాగుతుంది..!

దయచేసి పిల్లలకి ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియజేయండి, తద్వారా రేపటి రోజున ఆడవారి పైన జరిగే అత్యాచారాలని నిర్ములించండి..!

ఇక్కడ ఆడవారి పైన జరిగే అత్యాచారాల పట్ల ప్రభుత్వాలు, న్యాయస్థానాల పని తీరు గురించి ప్రస్తావించడం లేదు ఎందుకంటే వారి తీరు చూస్తూనే ఉన్నాం కదా..!

పలుకుబడి ఉంటే న్యాయం త్వరగా జరుగుతుంది లేదంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారు..!

ఘటనలు జరిగి కోర్టుకు వెళ్లిన కేసుల విచారణ వాయిదాలు పడడమే కాకుండా వేసిన శిక్షలు కూడా వాయిదా పడుతుంటే వాటి గురించి ఇంకేం మాట్లాడతాం..!

 

ఒక్క మాటలో చెప్పాలంటే
రాజకీయంగా అతి పెద్ద పదవుల్లో ఉన్నవారి పిల్లలకి ఏమైనా జరితే తప్ప ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాల పైన బలమైన చట్టాలు తెచ్చేలా మన నాయకుల్లో చలనం కలిగేలా లేదు..!

ఈ జగతికి మహిళలే అందం,
మహిళల వల్లే ఆనందం,
వారు లేకపోతే జగమంతా అంధకారం..!

ఒక్క మాటలో చెప్పాలి అంటే
ఆశలు పేర్చుకుంటూ
కాదంటే ఓర్చుకుంటూ
బాధ్యతలను తీర్చుకుంటూ
బంధాలను ప్రేమిస్తూ
భారమైనా బ్రతికేస్తూ
బాధను భరిస్తూ
ఘోరాలను సహిస్తూ
బతుకే పోరాటంగా బ్రతికే వారే మహిళలు..!

ఆడపిల్లగా పుట్టడం అదృష్టం,
అమ్మాయిగా పెరగడం ఐశ్వర్యం,
ఇల్లాలుగా కలిసిపోవడం అందం,
అమ్మగా కుటుంబాన్ని మోయడం ఓనత్యం..!

ఆలోచించే తీరు మార్చుకుందాం,
పిల్లల్ని పెంచే మంచి పద్ధతి ఎంచుకుందాం,
ఆడవారి పైన జరిగే అఘాయిత్యాలు తగ్గించుకుందాం,
మన ఇంట్లో ఆడవారి లాగే అందరూ ఆడవాళ్ళని గౌరవించుకుందాం..!

మహిళలు అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..! 

 = రచయిత ట్విట్టరు హ్యాండిల్ @BharathAneNenu