ఆస్తి కోసం అయినోళ్లను ఆరుగురిని చంపేసింది

August 13, 2020

కేరళలో ఆమె ఇప్పుడు సంచలనం. సాధారణంగా ఆమెను చూసినోళ్లంతా చాలా బాగుందే అనుకుంటారు. ఆమె నవ్వినప్పుడు ఇంకా బాగుందనుకుంటారు. కానీ.. ఆ అందం వెనుక అసహ్యమైన మనసు ఉందని.. ఊహించని దుర్మార్గం ఉందన్న విషయం అవాక్కు అయ్యేలా చేస్తుంది. పాడు ఆస్తి కోసం ప్రేమించే మనుషుల్ని నిర్మోహమాటంగా నిర్మూలించిన తీరు చూస్తే.. ఆమె అసలు మనిషేనా? అన్న సందేహం రాక మానదు.
ఆస్తి కోసం అయినోళ్లను ఆరుగురిని హతమార్చటం ఒక ఎత్తు అయితే.. అనుమానం రాని రీతిలో చంపేసిన ఆమె పాపం పండి.. తాజాగా ఆమె చేసిన హత్యలన్ని ఒక్కొక్కటిగా బయటకు వచ్చి సంచలనంగా మారాయి. కోజికోడ్ కు చెందిన జోలీ అనే మహిళ.. తన రెండో భర్తతో కలిసి మొదటి భర్త కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టిన తీరును కేరళ క్రైం బ్రాంచ్ తాజాగా ఛేదించింది.
అనుమానాస్పద రీతిలో వరుసగా సాగుతున్నమరణాలపై అందిన ఫిర్యాదుతో విచారణ మొదలెట్టిన వారు.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. భర్త వద్దు కానీ.. భర్త తరఫు వారి ఆస్తిని సొంతం చేసుకునేందుకు జోలీ వేసిన ఎత్తులతో ఆమె భర్త.. వారి కుటుంబంలోని మరో ఐదుగురు హత్యకు గురయ్యారు. అయితే.. ఇదంతా సహజ మరణాలుగా భావించేలా జోలీ ప్లాన్ చేసింది. సైనేడ్ తో ఒక్కొక్కరిని  హతమార్చిన ఆమె.. ఆమె రెండో భర్త పైశాచికం తాజాగా బయటకు వచ్చింది.  
తొలుత 2002లో జోలీ అత్త అన్మమ్మ థామస్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దాన్ని సహజ మరణంగా భావించారు కుటుంబ సభ్యులంతా. ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత జోలీ మామ హార్ట్ ఫెయిల్ అయి మరణించారు. ఆ తర్వాత భర్తను సైతం రాయ్ థామస్ కూడా అనుకోనిరీతిలో మరణించారు.
ఆయన శవపరీక్షలో మాత్రం మరణానికి ముందు విషప్రయోగం జరిగినట్లుగా వెల్లడైంది. 2014లో అత్త సోదరుడ్ని జోలీ పొట్టన పెట్టుకుంది. తర్వాత భర్త బంధువుల కుమార్తె అయిన రెండేళ్ల అల్ఫాన్సా గుండెపోటుతో మరణించగా.. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే ఆ పాప తల్లి సిల్లీ కూడా మరణించారు. షాకింగ్ విషయం ఏమంటే.. సిల్లీ భర్తను జోలీ రెండో వివాహం చేసుకున్నారు. అయితే..అమెరికాలో స్థిరపడిన జోలీ మొదటి భర్త తమ్ముడు మోజో జరుగుతున్న దారుణాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. జోలీ ఘాతుకాలన్ని ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తనను నమ్మిన కుటుంబ సభ్యుల్ని సైనేడ్ ఉపయోగించిన చంపినట్లుగా పోలీసులు తమ విచారణలో తేల్చారు.