కొంప ముంచావుగా జగన్ !

July 05, 2020

ఏపీలో జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయి అనుకున్న వాళ్లందరికీ షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పథకాల్లో కోతలు, కరెంటు కోతలు, ఇసుక కోతలు... ప్రకృతి విపత్తలు.. తాజాగా వరల్డ్ బ్యాంక్ దెబ్బ. అయితే, అందరూ ఈ వరల్డ్ బ్యాంక్ లోను ఆగిపోవడాన్నే చూస్తున్నారు. లోను రద్దు కావడం వల్ల భవిష్యత్తులో అనేక అనుమానాలు కలిగే ప్రమాదం ఉంది. అసలు ఈ పాపం అంతా వైసీపీదే.
గుర్తుందా... తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఈ లోను ప్రాసెస్ మొదలైంది. అయితే, అప్పట్లో ఈ లోను అమరావతికి ఇవ్వొద్దని, అక్కడి భూములు వివాదాస్పదం అని వైసీపీ లేఖ రాసింది. ప్రభుత్వం అతి కష్టమ్మీద మళ్లీ వరల్డ్ బ్యాంకును ఒప్పించింది. అయితే, తదనంతరం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ దురుద్దేశం తెలియక లోకల్ వాళ్లే ఇలా అంటున్నారేంటి... అని భావించిన ప్రపంచ బ్యాంకు తనిఖీలు నిర్వహించి లోను ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అయితే, ఈ తనిఖీలకు కేంద్రం అడ్డుపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా తనిఖీలకు అనుమతి ఇవ్వద్దని చెప్పింది. మోడీ శిష్యుడు అయిన జగన్ చక్కగా తలూపారు. దీంతో తనిఖీలు చేయకుండా లోను ఇవ్వం అని వరల్డ్ బ్యాంకు లోను క్యాన్సిల్ చేసింది. ఇదంతా ఒక ఎత్తు. ఇక ముందు జరగబోయేది మరో ఎత్తు.

ఒకసారి క్రెడిట్ స్కోరులో ఒక మచ్చ ఉందంటే... అది అనేక ఇతర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఎలాగూ కేంద్రం నిధులు ఇవ్వదు. రాష్ట్రం సమకూర్చుకునే అవకాశాలను కల్పించదు. దీంతో అమరావతి కలగానే మిగిలిపోయేలా ఉంది. భవిష్యత్తులో ఏపీ సర్కారు ఏదైనా లోనుకు వెళ్లాలన్నా ఇపుడు రద్దయిన ఈ లోను ఎందుకు రద్దయిందన్న ప్రశ్న వస్తుంది. అపుడు వాళ్లు కూడా శూలశోధన చేస్తారు. ఏదో ఒక మెలిక పెడతారు. అంటే సమయానికి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉండవు. దీంతో అభివృద్ధి కుంటుపడుతుంది. అంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, జగన్ గురించి చంద్రబాబు చెప్పినవన్నీ జరుగుతున్నాయి.
కొసమెరుపు ఏంటంటే... ప్రపంచబ్యాంకు వెనుకంజ నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాలపైనా అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అమరావతి నిర్మాణానికి ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిర్ణయంతో ఏడీబీ ఏం చేస్తుందో అన్నఅనుమానాలు కలుగుతున్నాయి.