వుహాన్ లో ఉన్న మనోడు ఏం చెప్పాడో విన్నారా?

August 08, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు పుట్టినిల్లు వూహాన్ మహానగరమన్న సంగతి చిన్నపిల్లాడికి కూడా తెలిసిందే. కరోనా విరుచుకుపడిన వేళ.. ఆ మహానగరం నుంచి తిరిగి వచ్చేశారు పలువురు భారతీయులు. వీరి కోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి వేళలోనూ.. వూహాన్ నగరాన్ని వదిలిపెట్టకుండా అక్కడే ఉండిపోయారు కొందరు భారతీయులు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన అరుణ్ జీత్ టీ సత్రాజిత్. ఇతడు ఆ నగరంలో హైడ్రోబయోలజిస్ట్ గా వ్యవహరిస్తుంటారు.
కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వూహాన్ ను విడిచిపెట్టి ఊరికి వచ్చేయకుండా అక్కడే ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నకు సన్నగా నవ్వుతారు. భారతీయులు కష్టాలకు భయపడరని తాను బలంగా నమ్ముతానని.. ఆ విషయాన్ని తెలియజేయాలనుకున్నానని అందుకే ఉండిపోయినట్లు చెప్పారు. అంతేకాదు.. తాను తిరిగి వచ్చేయటం ద్వారా తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తానన్న ఆలోచన కూడా తనను వూహాన్ లోనే ఉండిపోయేలా చేసిందని చెబుతారు.
73 రోజుల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత రెండు రోజుల క్రితమే వూహాన్ మహానగరంలో లాక్ డౌన్ ఎత్తి వేయటమే కాదు.. జనజీవనం మామూలు పరిస్థితులకు చేరుకుంది. దగ్గర దగ్గర రెండున్నర నెల పాటు సాగిన లాక్ డౌన్ వేళ.. వూహాన్ నగరంలో ఉన్న అరుణ్ జీత్ తన అనుభవాల్ని చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే..
‘‘నా గది నుంచి 73 రోజులుగా బయటకు రాలేదు. నేను చేసిన పని ల్యాబ్.. రూమ్ కు దగ్గరే. అధికారుల అనుమతి తీసుకొని వెళ్లాను. లాక్ డౌన్ వేళ నేను పెద్దగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే.. మాట్లాడటానికి ఎవరూ లేరు కూడా. ఇన్నేసి రోజుల పాటు తక్కువగా మాట్లాడటం వల్ల ప్రస్తుతం మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నా. కరోనా కట్టడికి లాక్ డౌన్ కు మించింది మరొకటి లేదు. భారత ప్రభుత్వం సూచనల్ని దేశ ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలి’’ అని చెప్పారు.
వూహాన్ నగరంలో లాక్ డౌన్ విధించినప్పుడు.. అక్కడి ప్రజలెంతో క్రమశిక్షణతో వ్యవహరించారన్నారు. తన ఇంటి పక్కనే ఉండే ముగ్గురు చిన్నారులు లాక్ డౌన్ వేళ అసలు కనిపించలేదన్నారు. వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా బయటకు రావటానికి కొందరు ప్రజలు భయపడుతున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ ను సరిగ్గా పాటిస్తే.. వూహాన్ మాదిరి కరోనాను భారత్ తరిమికొట్టే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అశీర్వాద్ ఆటా కోసం అదే పనిగా రోడ్ల మీదకు తిరిగే అలవాటును వదిలేసి.. ఇంటి పట్టున ఉంటే.. కరోనాను ఖతం పట్టించొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.