డిప్రెషన్ లో ఏపీ !!

May 25, 2020

ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, సీినియర్ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగు సంవత్సరాలు వరుసగా డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసిన ఏపీని కేవలం మూడు నెలల్లో సింగిల్ డిజిట్ గ్రోత్ కు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే చెల్లుతుందన్నారు. మూడు నెలల్లో రాష్ట్రాన్ని ఇంత పతనం చేశారంటే భవిష్యత్తు ఎంత ఘోరంగా ఉండబోతోందో అని అనుమానం, ఆందోళన వ్యక్తంచేశారు.

ఆర్థిక వృద్ధిపై ఆర్థిక మాంద్యం ప్రభావం కంటే కూడా జగన్ ప్రభావం ఎక్కువగా ఉందని సూత్రీకరించిన యనమల... ఇంత అవివేకమైన నిర్ణయాలు చాలా ప్రమాదం అన్నారు. కోర్టు తీర్పులు, కేంద్రం హెచ్చరికలు విస్మరిస్తే ఏపీకి చీకటి రోజులు తప్పవు అని హెచ్చరించారు. రాష్ట్రం మొత్తాన్ని డిప్రెషన్లోకి నెట్టే ప్రయత్నం చాలా వేగంగా జరుగుతోందన్నారు. అనుభవ రాహిత్యం కంటే... అహంకారంతో పనికిమాలిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను చావు దెబ్బ తీస్తున్న జగన్ తప్పులు దిద్దుకోకపోతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందన్నారు. అపుడు ఎవరూ మనల్ని కాపాడలేని పరిస్థితి వస్తుందన్నారు.