వైసీపీలో వంశీకి మొదటి శత్రువు

July 13, 2020

ఏపీలో రాజకీయం మహా ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్ బై చెప్పేయటం ఒక ఎత్తు.. పార్టీ అధినేత.. ఎక్స్ బాస్ చంద్రబాబుపై ఆయన సంధించిన విమర్శలు మరో ఎత్తు.
ఇదిలా ఉంటే.. వల్లభనేని వంశీ అంటే ఏ మాత్రం గిట్టని ఆయన రాజకీయ ప్రత్యర్థి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వంశీ పార్టీ మారే విషయంపై  యార్లగడ్డ సంతోషంగా లేరన్న మాట వినిపిస్తోంది. వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. యార్లగడ్డ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది. ఇలాంటి వేళ.. యార్లగడ్డను జగన్ ఇప్పటికే బుజ్జగించినట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు పార్టీలోనే ఉంటారా? వేరే పార్టీలోకి జంప్ అవుతారా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో యార్లగడ్డ బదులిచ్చారు.
వంశీ పార్టీలోకి వస్తున్నట్లు తనకు తెలీదని.. కార్యకర్తల స్పందన ఆధారంగానే తన నిర్ణయం ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలని తాను నిర్ణయించుకున్నానని.. సమస్యల్ని సృష్టించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. వల్లభనేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పిన ఆయన.. నాకో క్యారక్టర్ ఉంది. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదని తేల్చేశారు.
పార్టీలోకి ఎవరొచ్చినా వారితో కలిసి పని చేస్తానని.. అయినా వంశీ ఉన్నాడని తాను రాజకీయాల్లోకి రాలేదని.. తాను మిగిలిన వారి మాదిరి పార్టీలు మారే రకం కాదన్నారు. వంశీ రాకను యార్లగడ్డ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. వారిని ఆయన ఎలా బుజ్జగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.