వైసీపీ అరాచకం... మాజీ మంత్రిపైనే దాడి

August 06, 2020

ఏపీలో అధికార పార్టీ వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఇటు విపక్ష టీడీపీతో పాటు అటు జనసేన కూడా గొంతెత్తి మరీ నినదిస్తుంటే.. వారి వాదన కరెక్టేనన్న రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. నిన్నటిదాకా టీడీపీ, జనసేనలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలపై వైసీపీ దాడులు చేస్తే... ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ పొంగూరు నారాయణపైనే ఆ పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. 

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... నారాయణ కుటుంబం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించేందుకు నారాయణ మంగళవారం అనంతపురం వెళ్లారు. అక్కడి నారాయణ క్యాంపస్ లో సమావేశాన్ని ముగించుకుని ఆయన బయటకు వస్తుండగా... నారాయణ అనంతపురం వచ్చారన్న సమాచారం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు ఆయనతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న వైసీపీ కార్యకర్త రాఘవేంద్ర రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో నారాయణ విద్యా సంస్థల్లో ఫీజులు అధికంగా ఉన్నాయని, కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాకు సంబంధించి సగం మేర ఫీజులు మినహాయించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ వినతికి నారాయణ కూడా సానుకూలంగానే స్పందించి... ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. అదే సమయంలో ఒక్కసారిగా రంగంలోకి దిగిన రాఘవేంద్ర రెడ్డి... నారాయణను వెనక నుంచి చొక్కా పట్టుకుని నిలబెట్టేశారు. అంతేకాకుండా నారాయణ ముందుకు వచ్చి గల్లా పట్టుకుని మరీ నిలబెట్టారు. సమాధానం ఇవ్వడంతో పాటుగా ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇక్కడిక్కడే ప్రకటించాలని దురుసుగా వ్యవహరించాడు. సిబ్బంది ఎలాగోలా రాఘవేంద్రరెడ్డి చేతుల్లో నుంచి నారాయణను విడిపించి... కారు వద్దకు తీసుకెళ్లారు. అయినా తగ్గని రాఘవేంద్రరెడ్డి బయటకు పరుగులు తీసి నారాయణ కారు బానెట్ పై పిడిగుద్దులు గుద్ది, అప్పటికీ కోపం చల్లారక కారుపై రాయితో దాడి చేశాడు. ఈ ఘటన వైసీపీ అరాచకానికి పరాకాష్టగా చెప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.