'ప‌ప్పు' కామెంట్... లౌక్యంగా స్పందించిన లోకేష్ !!

June 27, 2019

సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత భావ ప్ర‌కట‌న స్వేచ్ఛ హ‌ద్దులు దాటిపోయింది.ఎవ‌రైనా, ఏదైనా స్పందించ‌వ‌చ్చు, ఎలాగైనా స్పందించ‌వ‌చ్చు....అది ఇత‌రుల‌కు బాధ క‌లిగించినా ప‌ర్లేదు...అనే స్థాయికి ఈ స్వేచ్ఛ చేరిపోయింది. ఇలా శృతిమించి ట్రోల్ చేయ‌బ‌డిన వారిలో ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువ‌నేత నారా లోకేష్ ఒక‌రు. రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులు కావ‌చ్చు లేదా ఇంకొక‌రు కావ‌చ్చు లోకేష్‌పై అతి విమ‌ర్శ‌లు చేశార‌నే సంగ‌తి తెలిసిందే. `ప‌ప్పు` పేరుతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సాగిస్తున్నారు.

అయితే, ఇలా సోష‌ల్ మీడియాలో జ‌రిగే ట్రోల్ సంగ‌తి లోకేష్‌కు తెలుసా? త‌న‌పై వ‌స్తున్న సెటైర్ల‌కు ఆయ‌న ఏం స‌మాధానం ఇస్తారు. అనే ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. ఇదే ఆస‌క్తితో ఓ మీడియా సంస్థ ఈ ప్ర‌శ్న‌ను నేరుగా ఆయ‌న్నే అడిగింది. దానికి చాలా కూల్‌గా లోకేష్ స్పందించారు. హోరాహోరీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సంద‌ర్భంలో ఓ మీడియా సంస్థ ఈ ప్ర‌శ్న అడిగితే...ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా రియాక్ట‌య్యారు లోకేష్‌!

త‌ను ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ``మిమ్మ‌ల్ని పప్పు అని పిలుస్తుండటంపై ఏ విధంగా స్పందిస్తారు?`` అని స‌ద‌రు మీడియా సంస్థ ప్ర‌శ్నించగా....``ఆ ప్ర‌చారం వైసీపీ నాయకులదే. వారికి వేరే పని లేదు. అందరికీ పేర్లు పెడతారు. వాళ్లందరినీ ఒక్కటే అడుగుతున్నాను...ఏపీకి ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను. నా శాఖ‌ల ప‌రంగా ఎన్నో అవార్డులు సాధించాను. ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని. నేను చేస్తున్న పనికి వాళ్లు నన్ను పప్పు అంటే అది వాళ్లిష్టం`` అంటూ సూటిగా, ఘాటుగా, లౌక్యంగా లోకేష్ స్పందించారు.

ఇక త‌న వ్య‌క్తిగ‌త అంశాల గురించి స్పందిస్తూ, త‌న‌కు కుటుంబాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంద‌ని లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబ జీవితాన్ని మిస్ అవ్వడం తప్పదని చెప్పారు. కుమారుడు దేవాన్ష్‌కు సంబంధించిన వీడియోలను తనకు తన భార్య బ్రాహ్మణి పంపుతుంటుందని, ఆ రకంగా కొంత లోటు తీరుతుందని పేర్కొన్నారు.