ఇదే జరిగితే ఏపీలో వైసీపీ గల్లంతే

May 28, 2020

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ‘కియా’ ఒకటి. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు దోహదపడే ఈ కియా మోటర్స్ పరిశ్రమతో రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. విభజన తర్వాత కష్టాలతో సతమతమవుతున్న నవ్యాంధ్రకు పారిశ్రామిక కళను సంతరించి పెట్టింది కియా మోటార్స్. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కియాతో 2017 ఏప్రిల్‌ 27న ఒప్పందం చేసుకుంది. అదే ఏడాది నవంబరు 15న పరిశ్రమ పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి 22న ఫ్రేమ్‌ ఇన్‌స్టాలేషన్‌ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత వేగంగా పనులు చేసి ఇపుడు ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కియా వాణిజ్య ఉత్పత్తి మొదలవబోతుంది. కియ మోటార్స్‌ ప్లాంటులో కార్ల తయారీ ట్రయల్‌ రన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మంగళవారం ప్రారంభించారు. కియా పరిశ్రమలోని ప్రెస్‌షాప్‌లో ప్రయోగాత్మక ఉత్పత్తిని ప్రారంభించాక ఇక్కడ తయారుచేసిన ఎస్పీ2ఐ మోడల్‌ కారును టెస్ట్‌ ట్రాక్‌పై నడిపారు. ఈ సందర్భంగా కియా తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఎలక్ట్రిక్‌ కారును బహూకరించారు.

 

రాష్ట్రానికి ఎంతో కీర్తిని తెచ్చిపెడుతున్న కియా మోటర్స్ సంస్థ విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్ల ట్రయల్ రన్ సందర్భంగా చంద్రబాబు ‘‘కియలో స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేశాం. ఇప్పటివరకు ఉద్యోగాల్లో చేరినవారిలో 64% మంది మన రాష్ట్రం వారే. అందులో 86% మంది స్థానికులే ఉన్నారు. కియతో ప్రత్యక్షంగా 4వేలమందికి, పరోక్షంగా 7వేలమందికి ఉద్యోగాలు వస్తాయి. వీటిల్లో అత్యధికులు స్థానికులే ఉండేలాచేస్తాం’’ అని వెల్లడించారు. అయితే, వైసీపీ మాత్రం ఇక్కడ రాజకీయం చేస్తోంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని, చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్ల నీటిని పరిశ్రమకే వాడుకుంటున్నారని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెబుతూ సోమవారం కియా ముందు ధర్నాకు పిలుపునిచ్చింది.

దీనికి భారీ సంఖ్యలో జనసమీకరణ చేయాలని అక్కడి నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, అక్కడ భారీ హింస చేయాలని వైసీపీ భావిస్తుందని రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పరిశ్రమల ముందు ధర్నాలు చేయడం వల్ల అభివృద్ధిని అడ్డుకుంటారనే పేరు ఆ పార్టీకే వస్తోంది. అంతేకాదు, రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పార్టీ నేతలు చేయబోయే ధర్నా వల్ల వైసీపీకి నష్టం జరగడంతో పాటు రాష్ట్ర అభివద్ధి కూడా ఆగిపోతుంది. దీనిని క్యాష్ చేసుకుని అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీని దెబ్బకొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యతిరేకతకు ఎదుర్కొంటున్న వైసీపీ ఈ దెబ్బతో ఏపీలో గల్లంతవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.