రెండుగా చీలి... కొట్టుకున్న వైసీపీ వర్గాలు

August 12, 2020

​స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో వైకాపా లో కలహాలు. కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి విపరీతంగా కొట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఆకులపేట పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం పథకాలు నిర్మాణ శంకుస్థాపన లో ఈ గొడవలు చెలరేగాయి. శంకుస్థాపన అనంతరం తమ్మినేని సీతారాం వెళ్లిపోయాక అక్కడున్న వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. 

వైకాపా శ్రేణులు ఇలా కొట్టుకోవడం ఇక్కడే కాదు జగన్ అధికారంలోకి వచ్చాక ఈ సంస్కృతి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు సోకడంపై సొంత పార్టీ నేతలు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ‘‘ప్రశాంతతకు మారు పేరైన సిక్కోలుకి కూడా ప్రశాంతత లేకుండా చేస్తారా ? పంపకాల్లో తేడానో, ఏమో కాని, స్పీకర్ తమ్మినేని పర్యటనలోనే కొట్టుకున్నారు వైసీపీ నేతలు‘‘ అంటూ పార్టీ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించింది.

స్పీకరు పదవి వల్ల ఇంతకాలం వేచిచూసిన తన కోరిక తీరడం లేదో ఏమో... మంత్రి పదవి కోసం ఆయన పరితపిస్తున్నారు. అందుకనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా... మంత్రివర్గంలో చేరాలని తహతహలాడుతున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.​