ఉత్తరాంధ్రలో సీన్ రివర్స్... వైసీపీకి షాక్

June 03, 2020

ఎన్నికలకు ముందు టిక్కెట్, ప్రాధాన్యత, గెలుపోటములు.. ఇలా ఎన్నో బేరీజు వేసుకొని నేతలు పార్టీలు మారడం సహజం. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు అధికార పార్టీలో చేరడం కామన్. కానీ ఆంధ్రప్రదేశ్‌లో సీన్ రివర్స్ అయింది. కేవలం 10 నెలల కాలంలోనే జగన్‌కు షాక్ తగలడం గమనార్హం. అది కూడా స్వయంగా ఓ పార్టీ అధినేత ఓడిన నియోజకవర్గంలోనే.. వైసీపీకి చుక్కెదురైంది. గత ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే సీటు గెలిచింది.

గాజువాక, బీమవరంల నుండి పోటీ చేసిన జనసేనాని రెండుచోట్లా ఓడారు. అలాంటి గాజువాకలో వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కకు వస్తున్నారు. ఆదివారం జనసేనని సంక్షంలో గాజువాక వైసీపీ నేతలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనసేనలో చేరడం తమకు చాలా ఆనందం కలిగించిందని చెప్పారు.

గాజువాక నుండి పవన్ కళ్యాణ్‌పై వైసీపీకి చెందిన తిప్పల నాగిరెడ్డి గెలిచారు. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీకి సొంత పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. 2024లో పవన్ తిరుపతి నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఐతే గాజువాకను వదిలే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం గాజువాకకు చెందిన జనసేన నాయకులు కొంతమంది వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుండి ఇతర నేతలు జనసేనలో చేరారు.

ఓ వైపు ఏపీలో జగన్ పాలన పట్ల అసంతృప్తి, మరోవైపు పవన్ ప్రజా సమస్యలపై పోరాడుతుండటం, జనసేన బలం పెరుగుతుందని, పైగా బీజేపీ కలవడంతో ఇది ప్లస్ అవుతుందనే కారణాలతో వైసీపీలో అసంతృప్త నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు.

గాజువాక నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత గోవింద రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, యువకులు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయం ఇదేనని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.