మంత్రి వర్సెస్ స్పీకర్.. అప్పుడే మొదలైపోయింది

January 26, 2020

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ్మినేని స్పీకర్‌లా వ్యవహరిస్తున్నారన్న మాట వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్.. తమ్మినేని తీరుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయంటున్నారు ఆయన అనుచరులు.
తమ్మినేని స్పీకరైన తరువాత శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికి మూడుసార్లు శ్రీకాకుళం వెళ్లారు. అంతేకాదు.. ఆయన స్పీకరైన తరువాత తొలిసారి జిల్లాకు వెళ్లినప్పుడే ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలకు జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాసుకు ఆహ్వానం కానీ, సమచారం కానీ అందలేదట. దీంతో ధర్మాన కృష్ణదాస్ తమ్మినేని తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం.
ధర్మాన కృష్ణదాస్ తొలిసారి మంత్రి కాగా.. తమ్మినేనికి మంత్రిగా గతంలో మంచి అనుభవం ఉంది. అంతేకాదు.. సీనియర్ నాయకుడిగా ఆయన జిల్లాపై పట్టు సాధించడానికే ఇలా చేశారని తెలుస్తోంది. స్పీకరైన తరువాత తొలి పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ తీయడం.. సమీక్షలు నిర్వహించడంతో ఇక జిల్లా రాజకీయం తమ్మినేని చుట్టూనే తిరగనుందన్న సంకేతాలు వెళ్లాయి. మరోవైపు కృష్ణదాసుకు సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు ఇలాంటి దూకుడు రాజకీయాలు తెలియవు.. పైగా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా గ్రిప్ చేయాల్సిన పరిస్థితులూ ఆయనకు లేవు. కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండేవారు. ఈ క్రమంలో తమ్మినేని ముందు కృష్ణదాస్ నిలవడం కష్టమవుతోందన్న వాదన వినిపిస్తోంది.
తమ్మినేని జోరు శ్రీకాకుళం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారుల బదిలీలు జరుగుతుండగా తమ్మినేని సిఫార్సులతోనే వందలకొద్దీ లేఖలు వచ్చాయట. ఇది చాలు ఆయన దూకుడును అర్థం చేసుకోవడానికి అంటున్నారు ఆ జిల్లా నేతలు. అయితే.. మంత్రిని డామినేట్ చేస్తూ స్పీకరు ఇలా రాజకీయాలు, పైరవీలు, సమీక్షలు చేయడంపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.