జగన్‌పై సీరియస్ కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

February 19, 2020

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి కేసులో తెల్లవారు జామున పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, మొబైల్‌ అండ్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోటంరెడ్డికి బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై పరోక్ష విమర్శలు చేశారు. సీఎం జగన్ వాస్తవాలు తెలుసుకుని విచారించాలంటూ ఆవేశంగా మాట్లాడారు.. తన తప్పుంటే ఎంపీడీవో సరళ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతానని అన్నారు.

            చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆధారాలుంటే, సొంత పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

            నెల్లూరు జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందేనని... అందుకే డీజీపీ ఆదేశించగానే ఆయన వెంటనే అరెస్ట్ చేశారాని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తనను అదే విధంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్నికల తరువాత కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. నాలుగు రోజుల క్రితమే ఈ విషయమై కలెక్టర్ కు తాను ఫిర్యాదు చేశానని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ అధినేత నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, ఆదేశాలు వచ్చిన గంటలోపే తనను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఓ శాసన సభ్యుడనైన తాను ఎక్కడకు పారిపోతానని అంత హడావుడిగా అరెస్ట్ చూపించాల్సి వచ్చిందని మండిపడ్డారు. తనకు ఫోన్ చేసి పిలిచినా స్టేషన్ కు వెళ్లేవాడినని, అరెస్ట్ చేస్తామని చెబితే లొంగిపోయి ఉండేవాడినని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు పోలీసులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

            కాగా... వివాదానికి కారణమైన లేఅవుట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని, అయినా దానికి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రశ్నించానని చెప్పారు. నీటి కనెక్షన్ ఇవ్వకపోవడానికి మండలాధ్యక్షుడి నుంచి వచ్చిన ఒత్తిళ్లు కారణమని.. ఈ విషయం మిగతా అధికారులకూ తెలుసని.. మండలాధ్యక్షుడి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత కాకాణి గోవర్ధనరెడ్డిపై కోటంరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు.

            దీంతో వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇదే జిల్లాలో కోటంరెడ్డి, ఆదాల మధ్య కూడా పొరపొచ్చాలున్నట్లు చెబుతున్నారు. నాయకుల మధ్య ఆధిపత్య పోటీ నెల్లూరు వైసీపీలో కుమ్ములాటలు.. ఫలితంగా ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని తెలుస్తోంది. విషయం జగన్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్‌గా దృష్టిపెట్టనున్నట్లు సమాచారం.

Read Also

ఎవరు పెద్ద రౌడీ? చింతమనేనా? కోటంరెడ్డా?
జగన్ ఆహ్వానాన్ని మోదీ మన్నించినట్టా? లేనట్టా?
పులికి జగన్ పేరు పెట్టిన వైసీపీ లీడర్... ఎక్కడంటే..